నాంపల్లి, సెప్టెంబర్ 19 : మండలంలోని దేవత్‌పల్లి, శార్భాపురం రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణికులు కొన్నేండ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డును బీటీగా మార్చాలని గ్రామస్తులు పల్లెకు వచ్చిన ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధికి విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచిన తరువాత రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. హైదరాబాద్ హైవే నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవత్‌పల్లి మీదుగా శార్భాపురానికి 5.8 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వం రూ.4.35 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొద్దిరోజుల ముందే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దేవత్‌పల్లి, శార్భాపురానికి చెందిన గ్రామస్తులు మల్లేపల్లి, దేవరకొండ, హైదరాబాద్‌కు నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే వీరికి హైదరాబాద్ ఆర్ అండ్ బీ రోడ్డుకు చేరుకోవడానికి చాలా సులువు కానుంది.
గతంలో దేవత్‌పల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న శార్భాపురం ప్రస్తుతం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా రేఖ్యాతండా లో ఆవాస గ్రామంగా శర్భాపురం ఉన్నది. ఈ గ్రామానికి హైదరాబాద్ ఆర్ అండ్‌బీ రోడ్డు నుంచి దేవత్‌పల్లి మీదుగా శార్భాపురం ఊరి వరకు బీటీ రోడ్డు వేస్తుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే కూసుకుంట్లకు రుణపడి ఉంటాం
తాము ఎన్నో ఏండ్లుగా బీటీ రోడ్డు ఎదురు చూస్తున్నాం. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రుణపడి ఉంటాం. మా ఊరు నుంచి ఎకువగా మల్లేపల్లికి పోతాం. ఈ రోడ్డు వెంట పోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడే వాళ్ల ం. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కేవలం 5 నిమిషాల్లోనే హైదరాబాద్ రోడ్డుకు చేరుకుంటాం. అకడి నుంచి మల్లేపల్లి, దేవరకొండ , హైదరాబాద్ , వెళ్లాలంటే ప్రయాణం చాలా సులువుగా మారుతుంది.
-బత్తుల విజయ్, దేవత్‌పల్లి, గ్రామస్తుడు
రోడ్డు బాగా లేక అష్ట కష్టాలు పడుతున్నాం
రోడ్డు బాగాలేక అష్ట కష్టాలు పడుతున్న. దేవత్ పల్లి నుంచి హైదరాబాద్ రోడ్డు వరకు గుంతల మయంగా మారడంతో ప్రయాణం చేయాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. మా ఊరుకు బీబీ రోడ్డు కోసం ప్రభుత్వం పైసలు మంజూరు చేయడంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఈ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు ఇబ్బందులను తొలగిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– ముదిగొండ దుర్గయ్య, దేవత్ పల్లి