మిర్యాలగూడ రూరల్, మే 16 : మనుమడిని కాపాడబోయి తాత మృతిచెందిన విషాద సంఘటన మిర్యాలగూడ రూరల్ మండలం యాదగిరిపల్లిలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బోరు బావి పక్కన సుమారు 12 అడుగుల గోయి ఏర్పడింది. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నాగబోన నాగమ్మ భర్త వెంకన్న శనివారం ఉదయం తన కూతురు పిల్లలు హేమాన్షు, లోహితను పొలం వద్దకు తీసుకుని వెళ్లాడు. పనులు చేస్తుండగా మనుమడు హేమాన్షు ఆడుకుంటూ బోరు పక్కన ఏర్పడిన గుంతలో పడిపోయాడు.
అది గమనించిన వెంకన్న బాలుడిని పైకి తీసే క్రమంలో తాను జారీ తలక్రిందులుగా గుంతలో ఇరుక్కుపోయాడు. పైకి లేచేందుకు ప్రయత్నిస్తే లేవలేకపోతుండడంతో గమనించిన మనుమరాలు భయపడి సమీపంలో ఉన్న రైతులకు విషయం చెప్పింది. వారు బోరు గుంత వద్దకు వచ్చి వెంకన్నను, పిల్లవాడిని రక్షించే ప్రయత్నం చేశారు. రూరల్ ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఓ యువకుడి సాయంతో ఇద్దరిని గుంత నుండి వెలికితీశారు. వైద్య పరీక్షల కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకన్న మృతి చెందాడు. బాలుడు సురక్షితంగా ఉన్నాడు.