సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 28 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దర్జీల బతుకుల్లో దర్జా మాయమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో మేరు సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. అదానీ, అంబానీల కోసం చేతివృత్తులకు అన్యాయం చేస్తున్న బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గతంలో మేరు కులానికి చెందిన వారు మాత్రమే దర్జీ వృత్తి చేపట్టేవారని.. పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేదన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ల కోసం దర్జీల జీవితాలను చీకట్లోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. అదానీ, అంబానీల రెడీమేడ్ దుస్తుల రాకతో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి కులవృత్తులకు ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడిప్పుడే మళ్లీ టైలరింగ్‌కు డిమాండ్ పెరుగుతున్నదని పేర్కొన్నారు.
సూర్యాపేట అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సూర్యాపేటను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. జిల్లా కేంద్రంలో టైలర్లకు గతంలో 160 కుట్టు మిషన్లు అందజేశానని, ప్రస్తుతం మరో 220 మిషన్లు అందజేస్తానని తెలిపారు. మేరు సంఘం భవనానికి సంబంధించి స్థలాన్ని చూశామని, త్వరలోనే శంకుస్థాపన చేసుకొని దసరా నాటికి ప్రారంభించుకుందామన్నారు. అంతకు ముందు టైలర్స్డే సృష్టికర్త విలియం ఎలియన్ హౌ, జటంగి శంకరదాసమయ్య చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మేరు సంఘం రాష్ట్ర నాయకులు బోడపల్లి మాధవ్, గట్ల శరణ్, దూలం నగేశ్, శ్రీనివాస్, పాండురంగాచారి, నరేందర్, దీకొండ శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.