రామగిరి, నవంబర్ 1 : దీపావళి పండుగను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో గురువారం రాత్రి యాదవులు సదర్ సమ్మేళనం నిర్వహించారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి హాజరై యాదవ ప్రముఖులతో కలిసి శ్రీకృష్ణుడికి పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు.
హైదరాబాద్ నుంచి రప్పించిన దున్నపోతులను అలంకరించి ఎన్జీ కాలేజీ మైదానానికి డప్పు చప్పుళ్ల మధ్య తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు అబ్బురపర్చాయి. సదర్ సంబురాన్ని చూసేందుకు జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అఖిల భారత యాదవ సభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తరాల పరమేశ్‌యాదవ్, యాదవ ప్రముఖులు పిల్లి రామరా జు, అల్లి సుభాశ్, లొడంగి గోవర్ధన్, మామిడి పద్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.