సూర్యాపేట టౌన్, జనవరి 1 : 2024 సంవత్సరంలో అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, అన్ని రంగాల ప్రజలంతా సరికొత్త ఆలోచనలతో, ఐక్యతతో ముందుకు సాగాలని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది.
మొక్కలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే 2023 వచ్చి వెళ్లిపోయిందని, కాలం ఎవరి కోసం ఆగదు.. అందుకే సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. 2024 ఏడాదంతా అందరికీ మంచి జరుగాలని, మరింత అభివృద్ధితో ముందుకు సాగుదామని అన్నారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న కేసీఆర్ తొమ్మిదన్నరేండ్లలోనే నిరంతర అభివృద్ధి పాలనతో, వినూత్న పథకాలతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న రాష్ర్టాన్ని ఎవరూ ఊహించని రీతిలో తీర్చిదిద్ది అన్ని రాష్ర్టాలు మన వైపు చూసేలా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతున్నదని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, పుష్కలంగా తాగు, సాగునీరు, ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకలు, అభిమానులు ఉన్నారు.