దామరచర్ల, నవంబర్ 4 : మండలంలోని రైతులు ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్‌పై అంతగా ఆశచూపడం లేదు. పంట కొనుగోలు కోసం మండలంలోని దామరచర్ల, కొండ్రపోల్, కేజేఆర్కాలనీలో ఐకేపీ కేంద్రాలను వారం రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఒక్క రైతు కూడా ధాన్యాన్ని కేంద్రాలకు తరలించలేదు. ఐకేపీ కేంద్రాలు కేవలం బోర్డులకు పరిమితమై వెలవెల పోతున్నాయి. దొడ్డు వడ్లు కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి కూడా ధాన్యం రావడం లేదు. మండలంలో రైతులు పంట కోసిన వెంటనే సరాసరిగా మిల్లులకు తరలించి అమ్మకాలు జరుపుతున్నారు. కొంత మంది ఆంధ్రాకు తరలిస్తున్నారు. తెలంగాణ కంటే హెచ్ఎంటీ రకం ధాన్యానికి ఆంధ్రాలో అధిక ధర పలుకడంతో రైతులు అక్కడికి తరలిస్తున్నారు.
ఆంధ్రాలో సన్నాలకు క్వింటాకు రూ.2,500 వరకు మద్దతు ధర ఇస్తున్నట్లు రైతులు తెలిపారు. చింట్లు రకం ధాన్యం పడించిన రైతులు మిర్యాలగూడ మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లుల్లో తేమశాతం 25 ఉన్నా కొనుగోలు చేసి రూ.2,450 వరకు గిట్టుబాటు ధర ఇస్తుండగా ఐకేపీ కేంద్రాల వద్ద 17 శాతం తేమ ఉండి నాణ్యతతో ఉంటనే రూ.2,320 మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తారని తెలుపడంతో రైతులు అంత ఆసక్తి చూపడం లేదు. సన్నాలు కోసిన తర్వాత ఆరపెడితే ఎందుకు పనికిరావని, 17 మ్యాచర్ వచ్చే వరకు వడ్లను ఎండపెడితే క్వింటాకు 20 కేజీల వరకు తరుగు వస్తుందని, అలాంటప్పుడు 500 బోనస్ ఇచ్చి లాభం ఏందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు వానలు పడుతున్న క్రమంలో, తేమశాతం అధికంగా ఉండటంతో సన్నాలు ఎండే పరిస్థితులు లేవు. దీనితో ఇన్ని బాధలు ఎవరు పడుతారని రైతులు కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకుతరలిస్తున్నారు.