నల్లగొండ సిటీ ఏప్రిల్ 13: ధాన్యంలో తాలు ఉందనే నెపంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లారీలను దిగుమతి చేసుకోకపోవడంతో మిల్లులో ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు. కనగల్ మండలం దోరేపల్లి ఎక్స్ రోడ్డులో ఉన్న శ్రీవెంకటసాయి రైసు మిల్లులో తాలు పేరుతో ధాన్యం దిగుమతి నిలిపివేశారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం మిల్లు వద్దకు వచ్చి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని యాజమాన్యానికి సూచించారు.
ధాన్యం ఎందుకు దిగుమతి చేసుకోవడం లేదని ప్రశ్నించిన అయన, ఆ వెంటనే జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. అనంత రం డీఎస్వో వెంకటేశ్వర్లు మిల్లు వద్దకు వచ్చి యాజమాన్యం, భూపాల్‌రెడ్డితో మాట్లాడా రు. దిగుమతికి సంబంధించిన విషయాలను డీఎస్వో అడగడంతో మిల్లు యాజమాన్యం వద్ద సరైన సమాధానం లేక వడ్లలో తేమ, తాలు శాతం అధికంగా ఉందని, తాలు లేకుం డా వస్తేనే దిగుమతి చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై స్పందిన భూపాల్‌రెడ్డి వడ్లలో తాలును చూపించాలంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు.
మిల్లు వద్ద నిలిచిన ధాన్యం లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని కోరారు. దీంతో అధికారులు, మిల్లు యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని మిల్లర్ కొనుగోలు చేయక పోవడంతో ఎప్పు డు వానలు వచ్చి ధాన్యం తడుస్తుందోననే భయంతో ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఐకేపీలకు ధాన్యం వచ్చి 20 రోజులు కావొస్తున్నా కొనుగోలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులను అదుకోవాలన్నారు. కార్యక్రమంలో పర్వతగిరి బీఆర్ఎస్ సర్పంచ్ నెలకొందరాశి ముత్తయ్య, మాజీ ఎంపీపీ కరీం పాషా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్, ఎల్లమ్మ, నల్లబోతు యాదగిరి, చెన్నగోని రామచంద్రు, నాగరాజు తదితరులు ఉన్నారు.