నేరేడుచర్ల, నవంబర్ 10 : రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుటికీ చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ధాన్యం తేమ లేకుండా చూడాలి. కానీ వానకాలం వరి పంట ఎక్కువ శాతం మంది రైతులు కోతమిషన్ల ద్వారానే వరి కోయిస్తారు. నేరుగా కోత మిషన్లు ట్రాక్టర్ల బోరాలలో ధాన్యం పోస్తుంది. కొంచెం తేమతో ఉన్న ఆ ధాన్యం నేరుగా మిల్లర్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో మిల్లర్లు, దళారులు ఒక్కటై రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్నారు.
కోతల ప్రారంభ దశలో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కోతలు ముమ్మరమై ధాన్యం అధికంగా మార్కెట్లోకి వస్తున్న తరుణంలో ఒకే సారి ధరను తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. కాంటాళ్లో మోసం, తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. కొంత మంది రైస్ మిల్లర్లు తమ మిల్లు ధాన్యంతో నిండిపోయింది, ఇంకా తమకు అవసరం లేదని రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకొని కంట తడి పెట్టుకుంటూ తిరిగి వస్తున్నారు.
గత మూడు, నాలుగు రోజుల క్రితం వరకు హెచ్ఎంటీ, పూజలు, చింట్లూ రూ.2,400 నుంచి రూ.2,500 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్కసారిగా క్వింటాకు రూ. 200 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే వానకాలం పంట రూ. 3వేల నుంచి రూ. 3,200కి అమ్ముకుంటే నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొంత మంది దళారులు ఇప్పుడే డబ్బులు కావాలంటే ఇంకా తక్కువ ధర చెల్లిస్తున్నారు. దళారీ వ్యవస్థను రూపు మాపడానికి ప్రభుత్వం, అధికారులు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.