నకిరేకల్ మండలంలోని పార్బాయిల్డ్ రైస్‌మిల్లుల్లో రైతుల నిలువు దోపిడీ ఆగడం లేదు. తాలు పేరుతో క్వింటాకు 10 నుంచి 12 కిలోల తరుగుకు ఒప్పుకుంటే దిగుమతి చేస్తామని, లేకుంటే దిగుమతి చేసుకోమని బాహటంగానే చెబుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో వారం రోజులుగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా డీటీసీఎస్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన యాసంగి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఓ వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల అలసత్వం కారణంగా రైతులు అవస్థలు పడుతుంటే, మరో వైపు తాలు, తరుగు పేరుతో రైస్ మిల్లుల యాజమాన్యాలు రైతులను నిండా ముంచుతున్నాయి.
నకిరేకల్, ఏప్రిల్ 11: నకిరేకల్ మండలంలో గోరెంకలపల్లి, మర్రూర్, మంగళపల్లి, మండలాపురం, చందుపట్ల, చీమలగడ్డ, తాటికల్, బైరెడ్డిగూడెం, కడపర్తి, ఓగోడు, వల్లభాపురం, టేకులగూడెం, నోముల, నెల్లిబండలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 కేంద్రాలు మినహా 8 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంతవరకు కాంటాలు ప్రారంభించ లేదు. కాంటా వేసిన లారీలు పార్బాయిల్డ్ రైస్‌మిల్లుల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కేంద్రాల నుంచి కాంటా వేసిన ధాన్యాన్ని మండలంలోని పవన్‌సాయి, వినాయక, శ్రీ హరికృష్ణ, శ్రీలక్ష్మీ సరస్వతి, శ్రీ లక్ష్మీసాయి, మహీంద్ర, శ్రీ వైష్ణవి, బీఎంవీ ఆగ్రో, విజయదుర్గ, శివశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, పారాబయిల్డ్ రైస్‌మిల్లులకు పంపుతున్నారు.
ఒక్కో రైసు మిల్లు వద్ద 2 నుంచి 3 లారీలు దిగుమతి చేసుకోకుండా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. యాసంగి పంటల్లో కాసింత తాలు ఉన్నప్పటికీ అదే అదునుగా భావించిన కొన్ని పార్బాయిల్డ్ రైస్ మిల్లులు తమను తాలు, తరుగు పేరుతో ముప్పుతిప్పలు పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగుకు అంగీకరించకుంటే ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా…కొనుగోలు కేంద్రాల వద్ద తమకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా సెంటర్లపై క్షేత్రస్థాయలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాలు, తరుగు పేరుతో మిల్లర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా డీటీసీఎస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. తాలు తరుగుపై, మిల్లర్లపై, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
నెల్లిబండ కేంద్రంలో వడ్లు పోసి 20 రోజు లు అయితుంది. మా యిశ్చర్ 12, 13 వ స్తుంది. వడ్లు ఎండలకు గట్టిగ అయితున్నయ్. తాలు ఉంద ని బస్తాకు నాలుగు, ఐదు కిలోలు తరుగు తీస్తమంటున్నరు. రె క్కలొడిసి కష్టపడినం..ఇట్ల తరుగు తీసి మా రెక్కలను కొడుతుర్రు. మా బాధలు చెప్పుకుందామంటే 20 రోజుల నుంచి ఒక్క సారు కూడా ఈ సెంటర్‌కు రావట్లేదు. ఇన్ని రోజులు ఎండబోసిన వడ్లు ఆగమయితయి.
– భూపతి యాదమ్మ, బాబన్సాహెబ్గూడెం
నాకు రెండున్నర ఎకరాలు ఉంది. ప్రతి సంవత్సరం నెల్లిబండ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొస్తాం. వారం రోజుల్లో వడ్లు కాంటా వేసేవాళ్లు. ఈ సారి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అయితుంది. ఇంతవరకూ కాంటా వేయట్లేదు. 4 రోజుల కిందట రెండు లారీలు లోడ్ అయి రైస్ మిల్లుకు వెళ్లాయి. ఇప్పటి వరకూ దిగుమతి చేసుకోలేదు. బస్తాకు 5 కిలోల తరుగు తీసుకుంటే దిగుమతి చేసుకుంటాని చెబుతున్నారు. తరుగు లేకుండా దిగుమతి చేసుకోవాలి.
– ఎస్కె ఖాసీం, నెల్లిబండ కేంద్రం
మిల్లుల వద్ద లారీలు ని లిపివేశారనే విషయం మా దృష్టికి రాలేదు. ధాన్యం మిల్లుల వద్ద ఎ క్కడా ఆగలేదు. మిల్ల ర్లు ఎక్కడా తరుగు తీ యడం లేదు. శుక్రవా రం మధ్యాహ్నం మిల్లర్లతో, సెంటర్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. తాలు పట్టకుండా కాంటా పెట్టొద్దని సీరియస్‌గా చెప్పాం. తాలు పట్టకుండా తెస్తే మిల్లర్లు తీసుకోబోమని చెప్పా రు. రైతులు ప్యాడీ క్లీనర్లతో తాలు పట్టకుంటే వెంటనే కాంటా వేస్తారు. వరి కోసేటప్పుడే తాలు తీసేసుకుని ధాన్యం తీసుకురావాలి.
-ఇన్చార్జి తహసీల్దార్ యశ్వంత్‌రాజ్