నల్లగొండ, మార్చి 25 : గతేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం ఈ సారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నది. కానీ కేంద్రాలు తొందరగా ప్రారంభమైనా ధాన్యం కొనుగోళ్లు మాత్రం ఆలస్యం చేయనున్నట్లు తెలుస్తున్నది. నల్లగొండ మండలంలోని ఆర్జాల బావితోపాటు తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే ఆయా కేంద్రాలకు ధాన్యం వచ్చినప్పటికీ ధాన్యం మాత్రం కొనవద్దని నిర్వాహకులకు సివిల్ సప్లయ్ యంత్రాంగం ఆదేశాలు ఇచ్చిందట. ఏప్రిల్ మొదటి వారం తర్వాతే ధాన్యం కొనాలని సూచించటంతో అప్పటి వరకు కేంద్రాలు పేరుకే ఉండనున్నాయి.
గన్నీ బ్యాగ్స్ లేవు..
నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 11.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 12.14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా. అందులో మిల్లర్లు 5.68లక్షల మెట్రిక్ టన్నులు కొంటే ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్లకు 5.57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే 10 నుంచి 20శాతం వరి కోతలు పూర్తి కాగా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. ధాన్యం కొనుగోలు చేయడానికి సోమవారం రెండు కేంద్రాలను మంత్రి ప్రారంభించగా ఆయా కేంద్రాలకు నామ మాత్రంగా ఒక తూకం యంత్రం పంపారని, కొనుగోళ్లు మాత్రం వద్దన్నారని నిర్వాహకులే అంటున్నారు.
ఈ సారి 1.39 కోట్ల గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే ఉన్నాయట. జిల్లాలో ఈ సారి 375 కేంద్రాలు ప్రారంభించి అందులో 71 కేంద్రాల ద్వారా సన్న ధాన్యం కొనాలని సూచించిన అధికారులు ఆయా కేంద్రాలకు గన్నీ బ్యాకులుగాని, కాంటాలు గాని పంపలేదు. ఇక కొన్న ధాన్యం వివరాలు అప్లోడ్ చేయడానికి ట్యాబ్స్ ఇవ్వకపోగా, వాటికి సంబంధించిన యాప్స్ కూడా చెప్పక ముందే ప్రారంభాలు చేయడం గమనార్హం.