నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహరలోపం బారిన పడుతారు. అందువల్ల ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నులి పురుగులు ఉన్న చిన్నారులు ఆరుబయట మలవిసర్జన చేస్తే అవి ఇతరులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. మల పరీక్ష ద్వారా నులి పురుగులను గుర్తించవచ్చు. నులి పురుగుల లార్వాలో 20 లోపు ఉంటే మామూలు, వాటి సంఖ్య 20 నుంచి 40 వరకు ఉంటే మద్యస్తం, 40కి పైగా ఉంటే తీవ్రంగా ఉన్నట్లు. అయితే ముందు జాగ్రత్తతో వీటిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. నివారణకు పరిశుభ్రతను మించిన మందు లేదని స్పష్టం చేస్తున్నారు.
తిరుమలగిరి, సెప్టెంబర్ 14 : నులి పురుగుల బారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా జాతీయ నులి పురుగుల ముందు చేపట్టింది. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలు 2 లక్షలా 20 వేల మంది ఉన్నారు. ఏఎన్ఎంలు 340, ఆశ కార్యకర్తలు 1,035, అంగన్వాడీ కార్యకర్తలు 1,209, ఆర్బీఎస్కే టీంలు 9, బృందానికి నలుగురి చొప్పున నియమించారు. ఈ నెల 15, 22 తేదీల్లో ప్రతి ఒక్కరూ ఆల్బండజోల్ మాత్రలు వేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మాత్రలు 1 నుంచి 2 ఏండ్ల పిల్లలకు అర మాత్ర పౌడర్ చేసి తాపించాల్సి ఉంటుంది. అలాగే 2 నుంచి 3 ఏండ్లు గల పిల్లలకు ఒక మాత్ర పౌడర్ చేసి తాపించాలి. 19 ఏండ్లు నిండిన వారు ఒక మాత్ర వేసుకోవాలి.
నులి పురుగులు ఐదు రకాలు…
నులి పురుగులు ఐదు రకాలుగా ఉంటాయి. వాటిలో కొంకిపురుగులు, ఏలికపాములు, నులి పురుగులు, బద్దెపురుగు, విప్వామ్స్ అనే రకాలు ఉంటాయి. ఇవి 55 అడుగులు (17 మీటర్లు) పెరుగుతాయి. 25 ఏండ్లు బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. సరిగ్గా ఉడికించని మాంసాహారాలతో చుట్టు పురుగులు (నులి పురుగులు) కడుపులోకి చేరుతాయి. పిల్లలు మట్టిలో ఆడినప్పుడు పాదాల ద్వారా కొంకిపురుగుల లార్వాలు శరీరంలోకి చేరుతాయి.
నివారణతో సంపూర్ణ ఆరోగ్యం..
నులి పురుగుల వల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల ఆగిపోతున్నది. దీనితో పిల్లలు బక్కచిక్కినట్లు కనిపిస్తారు.
కడుపులో నొప్పి వస్తుంది. నులి పురుగులను నివారిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు . అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతున్నది. అందుకే ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నది.
మాత్రలు తప్పకుండా వేసుకోవాలి
1 నుంచి 19 ఏండ్ల వయస్సు గల పిల్లలు తప్పక ఆల్బెండజోల్స్ మాత్రలు వేసుకోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 ఏండ్ల వారు పూర్తి మాత్ర వేసుకోవాలి. ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది మాత్రలు అందజేస్తారు. ఇది నేరుగా మింగే మాత్ర కాదు చప్పరిస్తే సరిపోతుంది. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, సూర్యాపేట