– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
– అధికారుల నిర్లక్ష్యంపై చేనేత జౌళి శాఖ కార్యాలయంలో కార్మికుల నిరసన
నల్లగొండ రూరల్, జనవరి 28 : చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చేనేత రుణాలు పొంది మాఫీ కానీ పలువురు కార్మికులు బుధవారం జిల్లా కేంద్రంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడంతో పాటు, తక్షణమే రుణాలు మాఫీ చేయాలని కోరుతూ ఏడీ ద్వారక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల రుణాల మాఫీకి రూ.46 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వాటిని మాత్రం ఎన్నికలు వస్తున్నప్పుడే విడుదల చేస్తూ మభ్య పెడుతుందన్నారు.
ఇప్పటివరకు రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసినప్పటికీ , ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణాలు పొంది కటాఫ్ డేటు ఉన్నప్పటికీ, రుణాలు మాఫీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనికి తోడు చేనేత శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైందన్నారు . జిల్లా వ్యాప్తంగా ఎందరో కార్మికులు రుణాలు మాఫీ కాక, నిత్యం జిల్లా కేంద్రంలోని చేనేత శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, అధికారులు సమాధానం చెప్పడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకుల్లో రుణాలు పొందిన లబ్ధిదారులకు మాఫీ కాలేదని ఆరోపించారు. ఆ బ్యాంకర్లు ఇప్పటివరకు లిస్ట్ అందజేయడం లేదని చెప్పారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయం చేసుకుని తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వనమా రాములు, ఏలే శ్రీనివాస్, బోనగిరి సురేశ్, గుర్రం శ్రీనివాస్, ఆరోగ్యయ్య, సుందరమ్మ పాల్గొన్నారు.