తుంగతుర్తి, జూన్ 23 : ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్న రకం వరి విత్తనాలకు మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళాను ప్రారంభించి మాట్లాడారు. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్ 792, డబ్ల్యూజీఎల్44 (సిద్ధి), కేఎన్ఎం1638 రకాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం మీద ఎల్నినో ప్రభావం ఉన్నందున వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
జొన్నలు సజ్జలు, రాగులు, కందులు వంటి పంటలను వేసుకోవడం ద్వారా రైతులు నష్టాన్ని నివారించుకుని ఈ సీజన్ నుండి మంచి ఆదాయంతో బయటపడాలన్నారు. దొడ్డు రకాలు సాగు చేయటం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చన్నారు. ప్రతి రైతు వేదికలో ఈ మేళాను ఈ నెల 30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడ్దల రమేష్, ఏవో దేవప్రసాద్, ఏఈఓలు జోష్ణ, శ్వేత, పంచాయతీ సెక్రెటరీ, గ్రామ రైతులు పాల్గొన్నారు.