సూర్యాపేట, అక్టోబర్ 22 : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సూర్యాపేటకు రానున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గవర్నర్ పర్యటనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ సూర్యాపేట కలెక్టరేట్‌కు చేరుకుంటారని తెలిపారు. 11.30 గంటలకు వరకు జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని, అనంతరం శాఖల వారీగా లక్ష్యాలను వివరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
11.30 గంటల నుంచి 12.30 గంటలకు జిల్లాలోని కవులు, కళాకారులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పర్యాటక వివరాలను తెలిపేలా 5 స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ అప్పారావు, డీఈఓ అశోక్, డీయంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.