రామగిరి, ఆగస్టు 13 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాన్వకేషన్‌కు చాన్సలర్ హోదాలో హాజరు కావాలని కోరుతూ బుధవారం ఎంజీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. కాన్వకేషన్ నిర్వహణకై అనుమతితో పాటు అనువైన తేదీని సూచించాల్సిందిగా వీసీ కోరారు.
ఈ సందర్భంగా ఎంజీయూ అభివృద్ధి, ఇతర అంశాలపై నివేదికను గవర్నర్‌కు అందజేశారు. ఎంజీయూ చేపడుతున్న కోర్సులు, విద్యార్థుల ప్రగతి అంశాలను వీసీ వివరించారు. యూనివర్సిటీలో చదివే పీజీ విద్యార్థుల ప్రాజెక్టులను జర్నల్స్‌లో పబ్లికేషన్ చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాకుండా నేటి సాంకేతిక కాలానికి అనుగుణంగా నూతన పరిశోధనలను విద్యార్థులచే చేపట్టేలా అధ్యాపకులు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు.
75 శాతం హాజరు కంటే తక్కువగా ఉన్నా విద్యార్థులను పరీక్షలకు హాజరవకుండా డిడెంట్ చేసినట్లు వెల్లడించారు. వర్సిటీ అనుబంధ అన్ని కళాశాల్లోనూ బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా యూనివర్సిటీ నిర్వహించే ఐయూటీ, ఐసీటీ క్రీడల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రణాళికలు తయారు చేసి షెడ్యూల్ విడుదల చేసినట్లు చెప్పారు. మిగిలిన యూనివర్సిటీలకు ధీటుగా ఎంజీయూను అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : ఎంజీయూ కాన్వకేషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం