యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ రైతుల ముందస్తు అరెస్టులతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారింది. తెల్లవారు జాము నుంచే పోలీసులు నిర్వాసితులను అరెస్టు చేసి, నిర్బంధంలోకి తీసుకోవడం ప్రారంభించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్వాసితులతోపాటు సీపీఎం నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కడివారిని అక్కడే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించి, ఉదయం నుంచి సాయంత్ర వరకు నిర్బంధించారు.
ట్రిపుల్ ఆర్ బాధితులకు మద్దతుగా సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి సీపీఎం పిలుపునిచ్చింది. ట్రిపుల్ ఆర్‌లోని ఉత్తర, దక్షిణ భాగాల్లో భూములు కోల్పోయే రైతులు, నిర్వాసితులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వాసితులు జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు.
నిర్వాసితులను కట్టడి చేసేందుకు పోలీసులు ఉదయమే వారి ఇండ్ల వద్దకు వెళ్లి పడిగాపులు కాశారు. అందుబాటులో ఉన్నవారిని వాహనాల్లో ఎక్కించుకొని అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి మండల పరిధిలోని రాయగిరి, వలిగొండ మండలంలోని గోకారం, వర్కట్‌పల్లి, చౌటుప్పల్, నారాయణపురం తదితర మండలాలకు చెందిన నిర్వాసితులను హౌస్ అరెస్టు చేశారు.
అయినప్పటికీ అనేక మంది రైతులు హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు బయలుదేరి వెళ్లారు. అక్రమ అరెస్టులను సీపీఎంతో పాటు అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పోలీసుల తీరుకు నిరసనగా పలు పీఎస్‌లలో నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు, నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
తెల్లవారకముందే ముందస్తు అరెస్టులు..
చౌటుప్పల్, అక్టోబర్ 6 : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ ఉత్తర, దక్షిణ భాగంలో భూములు కోల్పోతున్న రైతుల పోరాటం ఆగేటట్లు లేదు. నిరంతరం వివిధ రకాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు తేల్చిచెబుతున్నారు. గత రెండేళ్లుగా వారి ఉద్యమం కొనసాగుతోంది. ఓఆర్ఆర్ నుంచి మిగతా చోట్ల మాదిరిగా 40 కిలోమీటర్లు తీసుకోవాలని, భూమికి బదులు భూమి ఇవ్వాలని లేని పక్షంలో బహిరంగ మార్కెట్‌కు మూడు రెట్లు ధర చెల్లించాలంటూ పలు రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
గత నెల 12న హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మళ్లీ అదే కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు వందలాది మంది రైతులు సిద్ధమయ్యారు. దీంతో చౌటుప్పల్, భువనగిరి, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. తెల్లవారకముందే నిర్వాసితుల ఇండ్లకు వెళ్లి ముందస్తుగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు.
అయినప్పటికీ కొంత మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు ధర్నాలో పాల్గొనేందుకు తరలివెళ్లారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసేందుకు వెళుతుంటే పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పలువురు రైతులు పేర్కొన్నారు. రైతుల గోస ప్రభుత్వాని తాకుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. పెద్దల భూముల జోలికెళ్లకుండా తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద రైతుల భూములు గుంజుకోవడం అన్యాయమన్నారు.
అర్థరాత్రి రైతుల అరెస్ట్..
మర్రిగూడ, అక్టోబర్ 6 : ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న మర్రిగూడ,గట్టుప్పల్, చింతపల్లి మండలాలకు చెందిన రైతులను పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట మహాధర్నాకు పిలుపునివ్వడంతో ముందస్తుగా అరెస్ట్ చేశారు. వారు మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకుండా భూములను అక్రమంగా లాక్కోవాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాయకులు సల్వోజు రామలింగాచారి, కర్నాటి సుధాకర్, ముసుగు బుచ్చిరెడ్డి, కర్నాటి వెంకటేశం, కమ్మం రాములు, పెద్దగాని నర్సింహ, చంద్రయ్య, రైతులు జిట్టగోని ధనంజయ, జిల్లా కిశోర్, ఉప్పు బుచ్చప్ప, శవశంకర్, జాలా వెంకటేశ్, విగ్నేశ్, సత్తిరెడ్డి,శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదగిరి, వెంకన్న ఉన్నారు.
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన బాధితులు
చౌటుప్పల్, అక్టోబర్ 6: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను ఉత్తరభాగం ట్రిపుల్ ఆర్ బాధితులు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఓఆర్ఆర్ నుంచి మిగతా చోట్ల 40 కిలోమీటర్లు తీసుకొని, ఇక్కడ 28 కిలోమీటర్లకు కుదించారని ఆమెకు వివరించారు. లేకపోతే భూమికి బదులు భూమి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్‌కు మూడు రేట్లు ఆదనంగా ధర చెల్లించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. మీనాక్షి నటరాజన్‌ను కలిసిన వారిలో బాధితులు జాల వెంకటేశ్ యాదవ్, నాగవెల్లి దశరథ గౌడ్ తదితరులు ఉన్నారు.