నేరేడుచర్ల, డిసెంబర్ 22 : ఉపాధి హామీ పనుల్లో సింహ భాగం మహిళలకు కల్పించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధి హామీ పథకంలో భాగంగా గుర్తించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పనులను వేగవంతం చేసింది. గత అక్టోబర్ 2 నుంచి గ్రామ సభల్లో ఆమోదించిన పనులు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయడానికి మండల యూనిట్‌గా ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామాణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సూచించిన 6 రకాల పనులు ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన పనులను గుర్తించారు. సింహభాగం మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు.
మహిళా శక్తికి భరోసా..
మహిళా సంఘాల సభ్యులందరికీ ఉపాధి భరోసా కల్పించేలా ఉపాధి పథకంలో భాగస్వాములను చేయనున్నారు. వారిని స్వయం ఉపాధి వైపు మళ్లించేలా రుణాలిచ్చి ఆవులు, మేకల పెంపకం చేపట్టేలా చేస్తారు. పశువుల షెడ్లు, వర్మీ కంపోస్టు, అజోం మొక్కల పెంపకం, బీడు భూముల అభివృద్ధి వంటివి చేపట్టవచ్చు.
పొలం బాటలు
గ్రామాల్లో పంట ఉత్పత్తులను ఇంటికి చేర్చడానికి ఈ సారి మట్టిదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వాటికి అనుగుణంగా చేపట్టనున్నారు.
ఫలాలు, వనాలుఉద్యానశాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల ద్వారా రైతులను ప్రోత్సహించడం, వాటికి రాయితీపై బిందు, తుంపర్ల పరికరాలు ఇచ్చేలా చేస్తారు. ఈత తాటి వనాలు పెంచుతున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన నర్సరీల్లో ఈ పనులు చేపట్టనున్నారు.
జలనిధి
జల సంరక్షణలో ప్రజలను భాగసా మ్యం చేయడం, ఇంటింటా ఇంకుడు గుం తలు, ఫాం పాండ్లు, ఇంటి కప్పు భాగంలో కురిసన నీటిని భూగర్భంలోకి ఇంకించడం, చేతి పంపుల వద్ద ఇంకుడు గుంతలు, కందకాలు తవ్వడం, చెక్‌డ్యాం కట్టేలా చర్యలు తీసుకోనున్నారు.
గ్రామీణ పారిశుధ్యం
గ్రామాల్లో వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపటనున్నారు. ఒక్కో మండలంలో కనీసం 10 చొప్పున ఇంకుడు గుం తలను నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు.
మౌలిక సదుపాయాలు
గ్రామాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు, సిమ్మెంట్ రహదారులు నిర్మాణం, అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నారు. ప్రతి మండలంలో ఈ పనులు ఒకటి లేదా రెండు చొప్పున తొలి విడుత చేపట్టనున్నారు.