నేరేడుచర్ల, మార్చి 25 : పశువులకు నీడ కల్పించాలనే సంకల్పం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతున్నది. క్షేత్రస్థాయిలో అవగాహన కొరవడటంతో నిర్మాణాలు పురోగతికి నోచుకోవడం లేదు. ఉపాధి హామీ పథకం కింద మూగజీవాల కోసం వంద శాతం రాయితీపై షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేస్తున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1,660 మంది రైతులకు ఈ పథకం యూనిట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 696 మాత్రమే పూర్తయ్యాయి. అసలు ఈ యూనిట్ ఉందనే విషయం చాలా మంది రైతులకు తెలియదు. ఈ పథకంపై గ్రామాల్లో ప్రచారం లేక పోవడంతో దరఖాస్తు చేసుకోలేక పోయారు. యూనిట్ మంజూరైన వారికి సైతం సరైన అవగాహన కల్పించకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది.
గత సంవత్సరం నవంబర్, డిసెంబర్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1,660 మంది దరఖాస్తు చేసుకోగా వారందరినీ ప్రభుత్వం అర్హులుగా గుర్తించి యూనిట్లు మంజూరు చేసింది. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 85వేలు చెల్లించడంతోపాటు ఈ మొత్తానికి రాయితీ ఇస్తుంది. ఉపాధి జాబ్ కార్డు, ఐదెకరాల వ్యవసాయ భూమితోపాటు మూడు పశువులు కలిగి ఉన్న వారిని అర్హులుగా నిర్ణయించింది. గ్రామసభ తీర్మానం పొందిన తర్వాత అర్హులుగా నిర్ణయిస్తారు. లబ్ధిదారుడు డబ్బులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని ప్రతి మండలంలో సుమారు 10 షెడ్ల నిర్మాణం చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్ష్యంగా నిర్ధేశించింది. చాలా చోట్ల ఈ యూనిట్‌పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. 1,660 మందికి మంజూరు కాగా ఇప్పటి వరకు 696 మాత్రమే పూర్తి చేశారు. 707 మంది పనులు చేపడుతుండగా మరో 257 ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. మరో ఐదు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పురోగతిలో ఉన్న షెడ్లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయో లేదోనని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం పురోగతిలో ఉన్న షెడ్ల నిర్మాణాలను ఈ నెల చివరిలోపు పూర్తి చేసి బిల్లులు పొందాలని రైతులకు సూచిస్తున్నారు.