సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలప్రారంభోత్సవసందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కార్యరూపంలోకి వచ్చాయి. ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు రూ.47.50 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా భానుపురి కళాభారతి, స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం నిర్మాణానికి రూ.25 కోట్ల చొప్పున రూ.75 కోట్లు మంజూరు చేసింది. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్‌కు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తొమ్మిదేండ్లలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట అన్ని రంగాల్లో అభివృద్ధ్దిలో దూసుకెళ్తున్నది. విమర్శించే వారు, కుట్రలు చేసే వారిని కూడా మంత్రి పెద్దగా పట్టించుకోకుండా తనను రెండు సార్లు గెలిపించిన సూర్యాపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రిగా తన నిధులతో పాటు సీఎం కేసీఆర్, ఐటీ,పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర శాఖల మంత్రుల నుంచి వందల కోట్లు తెస్తున్న విషయం విదితమే.
సూర్యాపేట జిల్లాకు ముఖ్యమంత్రితో పాటు ఏ మంత్రి వచ్చినా వదలకుండా నిధులు మంజూరు చేయించడం మంత్రి జగదీశ్‌రెడ్డి సక్సెస్ అవుతుండడంతో సూర్యాపేట మాత్రమే కాదు నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధ్ది పరుగులు పెడుతున్నది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కళాశాల, జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాల కోసం సీఎం కేసీఆర్ హాజరైన సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా కేంద్రానికి కావాల్సిన వాటితో పాటు జిల్లాలో ఇంకా మిగిలి ఉన్న కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లడం ఆ వెంటనే సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు తాజాగా రూ. 75 కోట్లు విడుదల చేస్తూ రెండు జీఓలు జారీ అయ్యాయి.
అన్ని హంగులతో స్టేడియం
సీఎం కేసీఆర్ హామీల్లో ఒకటైన జిల్లాలోని ఒక్కొ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం 475 పంచాయతీలకు రూ.47.50 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదల కాగా తాజాగా రూ.75 కోట్లు విడుదలయ్యాయి. సూర్యాపేటకు రూ.25 కోట్లతో భానుపురి కళాభారతితో పాటు రూ.50 కోట్లతో స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం కోసం మొత్తం రూ.75 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓలను విడుదల చేసింది. ఇటీవల వరకు తాత్కాలికంగా జిల్లా పోలీసు కార్యాలయానికి వినియోగించిన స్థలాన్ని ఖాళీ అయిన వెంటనే స్టేడియాన్ని అన్ని హంగులతో నిర్మించాలని ఆలోచతో మంత్రి జగదీశ్‌రెడ్డి నిధులు మంజూరు చేయించారు.
అలాగే స్వతహాగా మంత్రి స్పోర్ట్స్ అభిమాని కావడంతో స్పోర్ట్స్ పాఠశాలను కూడా మంజూరు చేయించారు. ఇక సూర్యాపేట గతంలో కవులు, కళాకారులకు పుట్టినిల్లు కావడంతో మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు కళలను కాపాడేందుకు కళాభారతిని నిర్మించనున్నారు. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.