నీలగిరి, ఫిబ్రవరి 25 : పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. మాతా శిశు సంరక్షణ విభాగంతోపాటు పలు వార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కేసుల విషయంలో రోగులు, వారి సహాయకులు డాక్టర్లు, సిబ్బందిని పరుష పదజాలంతో దూషిస్తున్నారని, ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, సమర్థవంతమైన డాక్టర్లు ఉండి 24 గంటలపాటు పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేసిన సిబ్బందిని ఇక్కడ నియమించామని, వీరంతా అపారమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు.
కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని కేసుల విషయలో డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రతి అంశాన్ని అతి సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ కొంతమంది కావాలని డాక్టర్లును, సిబ్బందిని వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆలా చేయవద్దని సూచించారు. బాధితులకు అన్యాయం జరిగితే చట్టప్రకారం న్యాయం పొందాలేగానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రభుత్వ అస్తులకు నష్టం చేయవద్దన్నారు. వారి వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేశ్, వైద్యులు ఉన్నారు.
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
నల్లగొండ : వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యశాఖ అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధిహామీ కూలీలు వడదెబ్బకు గురికాకుండా పని ప్రదేశంలో టెంట్ల ఏర్పాటు, తాగునీటి సరఫరా, ఓఆర్ఎస్ ద్రావణం వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి పాల్గొన్నారు.