చిన్న, సన్నకారు రైతులను లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా రాష్ట్రంలో పండ్ల వినియోగం పెరుగుతుండడం, మన అవసరాలకు తగ్గట్టు స్థానికంగా ఉత్పత్తి లేకపోవడంతో ఉద్యాన పంటల దిశగా వారిని ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 7 వేల ఎకరాల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ నెల 31 వరకు ఆసక్తి గల రైతులను గుర్తించి వచ్చే నెలాఖరులోగా మొక్కల నాటింపు పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. గుంతలు తీయడం దగ్గర నుంచి మొక్కలు అందజేత, వాటి సంరక్షణతోపాటు మూడేండ్లపాటు ఎరువులు, వాచ్ అండ్ వార్డుకూ నిధులు ఇవ్వనున్నది. ఐదెకరాల్లోపు రైతులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 95 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతుండగా, సర్కారు చొరవతో మరింత పెరుగనున్నాయి.
మూస పద్ధతి వ్యవసాయం కాకుండా రైతులను వాణిజ్య పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. పెద్ద రైతులు సాగు చేసే పండ్ల తోటలను చిన్న, సన్నకారు రైతులు సాగు చేసేవిధంగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని రైతులకు అందించనున్నారు. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఈ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. గుంతలు తీయడం మొదలు మొక్కల కొనుగోలు, నాటింపు, మూడేండ్లపాటు వాటి సంరక్షణ, ఎరువుల వరకు ప్రభుత్వమే భరించనుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కూడా కల్పించనున్నది. ఉమ్మడి జిల్లాలో 7వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటల పెంపకం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. వచ్చే నెల చివరి వరకు మొక్కలు నాటేలా నిర్దేశించింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా బత్తాయి సాగుకు ఎంతో ప్రసిద్ధి చెందినది. కాలానుగుణంగా సాగు నీరు అందుతుండడంతో వరి సాగు పెరిగింది. కాగా, రాష్ట్రంలో పండ్ల వినియోగం పెరుగుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి తగ్గించాలనే ఆలోచనతో రాష్ట్ర సర్కార్ పండ్ల తోటల సాగు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 50వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలని యోచించగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు వేల ఎకరాలకు సాయం అందించాలని నిర్ణయించింది. అందులో నల్లగొండ జిల్లాలో 4,110 ఎకరాలు, సూర్యాపేటలో 1,545, యాదాద్రి జిల్లాలో 1,410 ఎకరాల్లో కొత్తగా పండ్ల తోటల సాగు చేపట్టాలని నిర్దేశించింది. ఇందుకోసం ఈ నెల 31నాటికి దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులను గుర్తించి వచ్చే నెల 31 నాటికి మొక్కల నాటింపు పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కాగా, జిల్లాలో ఇప్పటికే 95వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి.
Nalgonda1
గుంతలు, మొక్కల రక్షణకు నిధులు
పండ్ల తోటల సాగులో సన్న, చిన్నకారు రైతులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఉపాధి హామీ, పీఎంకేఎస్‌వై నిధులతో చేపట్టిన ఈ పథకం ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు వర్తించనుంది. ఉద్యాన, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో కొనసాగనున్న ఈ పథకంలో అర్హులైన వారికి ఉపాధి హామీ నిధులతో గుంతలు తీసిన తర్వాత అధికారుల ద్వారా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఈ మొక్కలు నాటినందుకు గానూ ఉపాధి హామీ నుంచే నిధులు ఇచ్చి వాటి సంరక్షణకు మొక్కకు రూ.10, ఎరువులకు రూ.50 చొప్పున నెల వారీగా మూడేండ్ల పాటు నిర్వహణ ఖర్చులు ఇవ్వనున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉద్యాన శాఖ నుంచి 100శాతం సబ్సిడీతో, సన్న, చిన్న కారు రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. ఆరంభంలో చేపట్టిన మట్టి పరీక్షలకు సైతం ప్రభుత్వమే డబ్బులు చెల్లించనుంది.
దరఖాస్తు చేసే విధానం
పండ్ల తోటలు సాగు చేయాలనుకునే రైతులు తన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, ఉపాధి హామీ జాబ్ కార్డు జిరాక్స్ సెట్‌ను గ్రామపంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఓ, ఏఈఓ, ఏఓ, ఉద్యానవన అధికారికి అందించాల్సి ఉంటుంది. వారు ఆన్లైన్ చేసి అర్హులైన వారికి మంజూరు చేస్తారు. ఈ నెల 31 నాటికి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
జిల్లాలో 95వేల ఎకరాల్లో పండ్ల తోటలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 95వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 66,896 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు అవుతుండగా.. ప్రధానంగా బత్తాయి 46,818, నిమ్మ 15,964, మామిడి 2,752 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 12,707 ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతుండగా.. అత్యధికంగా బత్తాయి 7,321, నిమ్మ 3,619, మామిడి 1,767 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 14,879 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తుండగా.. బత్తాయి 9,618, నిమ్మ 4,322, మామిడి 939 ఎకరాల్లో సాగవుతున్నది.
మార్గదర్శకాలివి..
ఒక ఎకరం మామిడి తోట వేస్తే ప్రభుత్వం అందించే సహాయం ఇలా ఉంటుంది. తొలుత భూసార పరీక్ష కోసం రూ.275 చెల్లించనున్నది. ఒక ఎకరాలో గుంతలు తీయడానికి (70 గుంతలు వస్తాయి) రూ.14,470, మొక్కల కొనుగోలుకు (ఒక మొక్క రూ.30 చొప్పున) 70 మొక్కలకు రూ.2100 ఇస్తారు. మొక్కలు నాటడం, ఎరువలు వేయడానికి రూ.2,978, వాచ్, వార్డు (నీరు పట్టడం, కలుపు తీయడం) రూ.6,994, ఊత కర్రలకు రూ.1,215, ఎరువులకు మొక్కకు రూ.50 చొప్పున రూ.3,500 చెల్లిస్తారు. మొక్కలు నాటిన సంవత్సరం సుమారు రూ.31,503 ఖర్చు వస్తుంది. మొదటి సంవత్సరం వాచ్, వార్డుకు రూ.9,326, ఎరువులకు 3500 చొప్పున మొత్తం 12,826 రూపాయలు చెల్లిస్తారు. ఇలా మూడేండ్లలో ప్రభుత్వం రూ.61,657 చెల్లించనున్నది. దీంతోపాటు సబ్సిడీపై డ్రిప్ అందిస్తారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వం పండ్ల తోటల సాగు పెంచాలనే ఆలోచనతో ఈ ఏడాది కొత్త తోటల సాగుకు ఆర్థిక సాయం చేస్తున్నది. గరిష్ఠంగా ఐదు ఎకరాల భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి గుంతలు తీసే దగ్గర నుంచి మొక్కల పంపిణీ, వాటి సంరక్షణ, ఎరువులకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ అందజేస్తుంది.
– సంగీతలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, నల్లగొండ