పాడి రైతుల శ్రేయస్సు కోసం పురుడు పోసుకున్న నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్మూల్) ఇక కనుమరుగు కానుందా..? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాభాలతో సుమారు 157 ఎకరాల భూములు, ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిన ఆ సంస్థ ఇక మూత పడనుందా..? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నూతనంగా బ్యాధతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులు అవినీతి, తప్పుడు నిర్ణయాలతోపాటు రాజకీయ జోక్యంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను ఇక కొనసాగించలేమని దాదాపు చేతులెత్తేసినట్లు సమాచారం. నార్మూల్ భూములపై బడా నాయకుల కన్ను పడిందని, భూములను స్వాధీనం చేసుకునేందుకే సంస్థను మూసివేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి పేర్కొంటున్నారు.
– యాదగిరిగుట్ట, మే19
గతేడాది అక్టోబర్‌లో జరిగిన పాలక మండలి ఎన్నికల్లో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు వచ్చి హామీల వర్షం గుప్పించారు. 300 మంది పాల సంఘం చైర్మన్లతో క్యాంపు నిర్వహించి వారిని మభ్యపెట్టారు. తమను గెలిపిస్తే రూ. 5 బోనస్, రూ.30 కోట్ల ప్రభుత్వ గ్యాంట్స్తోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లిస్తామని హామీనిచ్చారు. కానీ నార్మూల్ సంస్థ మూసివేసే దిశకు చేరుకున్నా ఇప్పటి వరకు ఆ హామీపై ఇటు మంత్రి, ఎమ్మెల్యేలు ఊసెత్తడంలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమేయం లేకుండానే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నార్మూల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు, ఈ విషయంపై సీఎం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నార్మూల్ సంస్థపై చర్చించేందుకు సీఎం సమయం ఇవ్వడంలేదని విశ్వనీయవర్గాల సమాచారం. ఇకపోతే మదర్ విజయ బ్రాండ్ పేరుతో నార్మూల్ సంస్థ రోజుకు 50వేల లీటర్ల పాలతోపాటు ఇతర పదార్ధాలను విక్రయిస్తుండగా విజయ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి ఉక్కుపాదం మోపినట్లు సమాచారం. మదర్ విజయ్ బ్రాండ్‌ను వెంటనే నిలిపివేయాలని హుకూం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో నార్మూల్ సంస్థకు మరింత నష్టం వాటిల్లిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణ విజయను మాత్రం ప్రోత్సహించడం పట్ల మదర్ డెయిరీకి చెందిన పాలకవర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
348 సొసైటీలు, 32వేల మంది పాడి రైతులు, నిత్యం 40వేల లీటర్ల పాలను సేకరణ, 600 మంది ఉద్యోగులు కలిగిన నార్మూల్ 2003 సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి సంస్థగా మారింది. పాల మార్కెటింగ్‌కు ఢిల్లీకి చెందిన మదర్ డెయిరీతో 2005లో ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి లాభాల బాటలో కొనసాగుతూ వచ్చింది. 2015లో అమూల్ పాలు ప్యాకింగ్ చేసేందుకు నార్మూల్ ఒప్పందం చేసుకున్నది. మార్కెట్లో తమతో పోటీ ఉన్న అమూల్ పాల ప్యాకింగ్ ఒప్పందం చేసుకోవడం ఢిల్లీకి చెందిన మదర్ డెయిరీకి ఇష్టంలేదు. దీంతో మార్కెటింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో నార్మూల్, మదర్‌డెయిరీ బ్రాండ్‌తో తిరిగి మార్కెట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంస్థ రూ. 50 కోట్ల నష్టాల్లో ఉండగా అప్పటి పాలకవర్గం, సంస్థ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి పాల కొనుగోలును రోజుకు 40 వేల లీటర్ల నుంచి 1.20 లక్షల లీటర్ల వరకు పెంచి నష్టాన్ని అధిగమంచే ప్రయత్నం చేశారు. హాస్టళ్లకు పాల సరఫరా, యాదగిరిగుట్ట దేవస్థానంతోపాటు చెర్వుగట్టు, వేములవాడ దేవస్థానాలకు సైతం స్వచ్ఛమైన నెయ్యిని విక్రయిస్తూ మెరుగైన ఆదాయం రాబట్టారు. 95 వేల లీటర్ల పాలను మార్కెటింగ్ చేసి విక్రయాలు జరిపారు.
పాడి రైతుల ఆర్థిక పురోభివృద్ధికి లీటరు పాలకు రూ. 5 పెంచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయంతో ఏర్పాటైన పాలకవర్గం నిర్వాహకంతో పాల కొనుగోలు రోజుకు 30 నుంచి 40 వేల లీటర్లకు పడిపోయింది. దీంతోపాటు వేములవాడ, చెర్వుగట్టుకు నెయ్యి సరఫరా రద్దు అయ్యింది. హాస్టళ్ల పాల విక్రయాలు సైతం దాదాపుగా రద్దయ్యినట్టేనని సమాచారం. నేడో రేపో యాదగిరిగుట్ట దేవస్థానికి సైతం నెయ్యి విక్రయాలు రద్దు చేసి విజయ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో పడ్డారు. ఇక ఏం చేయాలో తోచక ప్రస్తుత నార్మూల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ఫిబ్రవరి 7న హయత్‌నగర్‌లోని డెయిరీ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో హాజరైన 311 మంది సొసైటీ అధ్యక్షుల్లో 299 మంది సంతకాలతో స్థిరాస్తుల విక్రయించేందుకు తీర్మానించారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో 29 ఎకరాలు, మిర్యాల గూడలోని 1.5 ఎకరాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించగా విక్రయాలు నిలిచిపోయాయి.
నార్మూల్ సంస్థను కాపాడాలని కోరుతూ గతంలో నార్మూల్ చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి వద్దకు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు, మరికొంత మంది పాలకవర్గం సభ్యులు సంస్థ పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. తాము సంస్థను కాపాడి ఈ స్థాయికి తీసుకొస్తే మీరు నష్టాల్లోకి ఎలా నెట్టివేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే ఎండీని తీసివేయాలని తెలిపినట్లు సమాచారం. దీంతో ఇటీవల నార్మూల్ ఎండీగా ఉన్న కృష్ణ రాజీనామా చేశారు. అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఎండీతో పాటు చైర్మన్‌గా ఉన్న గుడిపాటి మధుసూధన్‌రెడ్డి రాజీనామా చేయాలని పాలకవర్గం సభ్యులు పట్టుపట్టినట్లు సమాచారం. దీంతో పరిస్థితి తారుమారవుతుందన్న కారణంతో తిరిగి కృష్ణనే ఎండీగా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా నార్మూల్ సంస్థకు సంబంధించిన భూములపై బడా నాయకుల కన్ను పడినట్లు తెలుస్తున్నది. దీనిపై నార్మూల్ డెయిరీ ఎండీ కృష్ణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు
నార్మూల్ సంస్థను మూసివేసి భూములను లాక్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు. హయత్‌నగర్‌లో 102 ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో 29 ఎకరాలు, మిర్యాలగూడలో 1.5 ఎకరాలు, ఆలేరు, పరిగి, భువనగిరి ఇతర ప్రాంతాల్లో కలిపి నార్మూల్ సంస్థకు సుమారు 157 ఎకరాల భూములున్నాయి. వాటిపై బడా నాయకుల కన్ను పడింది. నార్మూల్ను మూసివేసి విజయ డెయిరీనే నడిపించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఇదే జరిగితే సుమారు 600 మందిపైగా ఉద్యోగులు రోడ్డున పడటం ఖాయం.
-లింగాల శ్రీకర్‌రెడ్డి, నార్మూల్ మాజీ చైర్మన్