పెన్‌పహాడ్, నవంబర్ 19 : పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్ చేసి, ప్రతి సబ్జెక్టులో 90 శాతం మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండలం అనంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠాలను చదివించడంతో పాటు నోట్‌బుక్స్‌ను పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పదో తరగతి జీవితంలో తొలి మెట్టు అని, మంచి మార్కులు సాధిస్తే ఇంటర్లో కోరుకున్న కళాశాలలో సీటు సాధించడం సులభమే కాదు, భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. పరీక్షల పట్ల భయం అవసరం లేదని, రోజూ బోధించిన పాఠాలను అదే రోజు సాయంత్రం మరోసారి పునఃపఠనం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు. ఒక అంశంపై స్పష్టమైన అవగాహన ఉంటే భయం అనే మాట ఉండదని, ఆత్మవిశ్వాసంతో చదివితే అనుకున్న ఫలితం సాధ్యం అని తెలిపారు. విద్యార్థులు అదనపు తరగతులను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
అనంతరం నారాయణగూడెం, అనంతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతారం గ్రామంలో నిర్మాణంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ లాలు నాయక్, ఎంపిడిఓ జానయ్య, ఎంఈఓ రవి, ఏఓ అనిల్ నాయక్, ఎంపిఓ రాజేశ్వర, ఏఈ నరేశ్, ఏఓ శ్రావణి, సింగిల్ విండో సీఈఓ అలకుంట్ల సైదులు, పంచాయతీ కార్యదర్శి సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ భేగం, ప్రధానోపాధ్యాయుడు రవీందర్ పాల్గొన్నారు.

Penpahad : నిరంతర అభ్యసనతో మంచి ఫలితాలు : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్