యాదాద్రి భువనగిరి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వగృహంలో రవి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణ చేపట్టి, నిజాల ను నిగ్గు తేల్చాలని మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీర్ల ఐలయ్య నివసిస్తున్న మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రవి ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని దీనిపై కూడా విచారణ చేపట్టాలని కోరారు.
ఈ మేరకు సోమవారం రాచకొండ సీపీ కార్యాలయంలో ఆమె లేఖ అందజేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా.. శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అనుమానాస్పదంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. రాత్రి 9గంటల సమయం లో రవి ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు రాత్రికి రాత్రే తహసీల్దార్‌తో పంచనామా చేయించి, భువనగిరి ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.
ఆత్మహత్యకు రెండు రోజుల క్రితం రవి తన సొం తూరు సైదాపురంలో ఉన్నాడని, రెండు రోజుల తర్వాత బీర్ల ఐలయ్య ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడి శవమై తేలడం అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు. రవి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే ఘటన సమయంలో రవి, ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. స్థానిక పోలీసులతో కాకుండా కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుతో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. లేఖ అందజేసిన వారిలో మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, కౌడే మహేందర్, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.