రెండో దశ గొర్రెల పంపిణీ కోసం రూ.6,125 కోట్లు మంజూరు
అవకతవకలు జరుగకుండా జియో ట్యాగింగ్
తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్
మిర్యాలగూడ టౌన్/ త్రిపురారం, ఫిబ్రవరి 8 : గొల్ల, కురుమలు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, త్రిపురారం మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో గొర్రెల మంద తగ్గితే.. స్వరాష్ట్రంలో పెరిగిందన్నారు. మొదటి దశలో రూ.5వేల కోట్లతో రాష్ట్రంలో 4,98,596 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశామన్నారు. త్వరలో ప్రారంభించనున్న రెండో దశలో రూ.6,125 కోట్లతో 3లక్షల 50 వేల మందికి గొర్రెల యూనిట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ దశలో యూనిట్‌కు రూ.లక్షా75 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవకతవకలు జరుగకుండా ప్రతి గొర్రెకు జియో ట్యాగ్ వేస్తున్నట్లు చెప్పారు.తెలంగాణ పథకాలు దేశంలోనే అద్భుతంగా ఉంటే.. అంగీకరించలేని ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వాళ్లకు సీఎం కేసీఆర్‌ను విమర్శంచే స్థాయి లేదని, పద్ధతి మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మతిలేని బండి సంజయ్ ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామంటున్నారని, కేసీఆర్‌ను టచ్ చేసి చూడు.. దేశం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 75 ఏండ్ల రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ను తప్పుపట్టడం అర్థరహితమన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే సబ్బండ వర్గాలకు న్యాయం
నిడమనూరు : సీఎం కేసీఆర్ పాలనలోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. ముకుందాపురంలో తన మిత్రుడు నోముల శంకర్ యాదవ్ వివాహ నిశ్చయ వేడుకకు హాజరైన ఆయన మొదటి నెల జీతం రూ. 50 వేలు బహూకరించారు. అనంతరం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కను నాటారు. అనంతరం తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ సలీం పాషా పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు నాగరాజ్ యాదవ్, ముద్ద నవీన్, శ్రీకాంత్, గజ్జి వెంకన్న, ముద్ద బక్కయ్య, ఆవుల శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్, హుస్సేన్, అనిల్ పాల్గొన్నారు.