– మాన్యంచెల్కలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
నీలగిరి, ఏప్రిల్ 08 : ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో రూ.1.91 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలతో అవసరమైన మౌలిక సదుపాయాలు, డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాన్యం చెల్క యు పిహెచ్ సి కి నూతన భవనాన్ని నిర్మించడమే కాకుండా, అవసరమైన మెడికల్ సామగ్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైతే మరింత సామగ్రిని సమకూరుస్తామన్నారు.
నల్లగొండ కార్పొరేషన్ అయినందున సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మంచి వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో 3 ఎకరాల స్థలంలో కంటి ఆస్పత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనుకోకుండా పట్టణ పి హెచ్ సి లో మందులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రయివేట్ మెడికల్ షాపును గుర్తించి అవసరమైన అత్యవసర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. విద్యతో పాటు పేద ప్రజలకు వైద్యం అందించేందుకు మంత్రి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాన్యం చెల్క తో పాటు, చుట్టుపక్కల వార్డుల ప్రజలకు పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్లు పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ను అర్హులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నరసింహారావు నేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, యు పి హెచ్ సి డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి