– చెర్లగౌరారం గ్రామంలో ఘనంగా ‘బాల పంచాయతీ’ కార్యక్రమం
నల్లగొండ సిటీ, జూన్ 06 : పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ‘బాల పంచాయతీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశానుసారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామస్థాయి నుండి పిల్లలకు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, గ్రామాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామంలో ఉన్న పలు సమస్యలపై తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, గ్రామాభివృద్ధి వంటి అంశాలపై బాలలు చర్చించారు. బాలలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లు, అవగాహన కార్యక్రమాలు, ప్రశ్నోత్తర సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా అభిలాషా బిష్త్ మాట్లాడుతూ పిల్లల హక్కులు, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, ప్రతి తల్లి తండ్రి పిల్లలకు సమయం కేటాయిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్లో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమలో మార్పు తీసుకురావాలని సూచించారు. అలాగే చిన్నారులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “పిల్లలే మన భవిష్యత్, వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి” అని ఆమె పేర్కొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమన్నారు. విద్యతో పాటు పిల్లల్లో సామాజిక అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని తెలిపారు. బాలలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ బాలల భద్రత, విద్య, మానసిక అభివృద్ధి కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలో బాలల సమస్యలు,రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యంగిస్థాన్ ఎన్జీఓ, ఆశ్రిత ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చివరగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బాలల సాధికారత, సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆదిరెడ్డి, రాము, కరుణాకర్, ఎస్.ఐ అంజలి, రాజీవ్ రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ సుశీందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, చెర్లగౌరారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.