కేతేపల్లి, ఆగస్టు 29 : తెలుగు భాషకు పట్టని గొడుగు గిడుగు రామ్మూర్తి పంతులు అని నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.భిక్షమయ్య అన్నారు. శుక్రవారం భీమవరంలో పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వ్యవహార భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. వ్యవహార భాషకు పట్టం కట్టిన మహనీయుడు గిడుగు అని కొనియాడారు. ఇలాంటి వారి వలనే మనం సరళమైన భాషను మాట్లాడ గలుగుతున్నామన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
అమ్మ లాంటి కమ్మనైన మాతృబాషను మరువొద్దు అన్నారు. ప్రపంచంలోని ఏ భాషనైనా తనలో ఇముడ్చుకోగల శక్తి తెలుగు భాషకు మాత్రమే ఉందన్నారు. విద్యార్థులు మాతృ భాషపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాపోలు పరమేశ్, బత్తుల జానకి రెడ్డి, గుమ్మడవల్లి రమేశ్, జి.వెంకటేశ్వర్లు, కన్నె శివయ్య, లగిశెట్టి శ్రీధర్, మేడం శేఖర్, దోరేపల్లి నాగయ్య, జూనియర్ అసిస్టెంట్ సుమన్, అటెండర్ అహ్మద్ పాల్గొన్నారు.
Kethepalli : ‘తెలుగు భాష గొడుగు గిడుగు’