మిర్యాలగూడ, మే 13 : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్ కోరారు. మంగళవారం వేర్‌హౌజ్ కార్మికుల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సమ్మె వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కులను కాల రాసేందుకు కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తుందని విమర్శించారు. కొత్త చట్టాల ద్వారా కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తీప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులందరూ ఈ సమ్మెను జయప్రదం చేయాలన్నారు. 20న సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుండి రాజీవ్ చౌక్ వరకు కార్మికుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రామ్మూర్తి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా నాయకులు బీఎం.నాయుడు, హమాలీ కార్మిక నాయకులు అంజల్ రావు, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, రామ్ నాయక్, సైదులు, అంజయ్య, కృష్ణ, వజ్రం పాల్గొన్నారు.