భువనగిరి అర్బన్, ఏప్రిల్ 3: భువనగిరి మండలంలోని నందనం గ్రామ పరిధిలో నిర్మించిన నీరా ఉత్పత్తుల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 10న గీత కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగీర్ కృష్ణయ్య తెలిపారు. భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్లో గురువారం ఏర్పాటు చేసిన కల్లుగీత కార్మిక సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నందనంలో రూ.8 కోట్లతో నీరా ప్రాజెక్టు భవన నిర్మాణం పూర్తి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ప్రారంభించడం లేదని తెలిపారు. 2023లో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ 6 నెలల్లో నీరా ప్రాజెక్టును ఇచ్చిన వాగ్దానం ప్రకారం పూర్తి చేయించారని, కానీ ప్రభుత్వం మారండంతో నేటికీ ప్రారంభంకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నీరా ప్రాజెక్టులో వైన్బీరు, జ్యూస్, చాక్లెట్లు, పంచదార వంటి అనేక రకాల ఆహార ఉత్పత్తులు తయారవుతాయని, దీంతో గీత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.5వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
నీరా ప్రాజెక్టు ప్రారంభించాలని చేపట్టే సామూహిక నిరాహార దీక్షలో గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అంతటి అశోక్, గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రంగ కొండల్, ఉపాధ్యక్షుడు కొండ అశోక్, నాయకులు గోద సాయిలు, రాజు, దానయ్య, భాస్కర్, బోయిని నర్సింహ, అంజయ్య, కృష్ణ పాల్గొన్నారు.