నీలగిరి, మార్చి 15 : వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ. వారి పనులను కలిసి చేసుకుంటారు. కొంతకాలం తరువాత వారికి గంజాయి అలవాటైంది. ఇద్దరు కలిసే సేవించి విక్రయించే వారు. చివరికి అ గంజాయే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ప్రాణాలు తీసుకునేలా చేసింది. గంజాయి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. పోలీసులకు చిక్కి కటాకటాల పాలయ్యారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాక్హిల్స్ కాలనీలో జరిగింది. ఇరువర్గాలకు చెందిన పదకొండు మంది యువకులపై కేసు నమోదు కాగా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన మేడబోయిన చక్రి, ఎలిశాల అఖిల్ స్నేహితులు. వీరికి గత కొంతకాలంగా గంజాయి అలవాటు కావడంతో చక్రి దూల్‌పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి మితుల్రతో కలిసి సేవించడమే కాకుండా ఇతరులకు విక్రయించే వాడు గత జనవరిలో చక్రి వద్ద గంజాయి పట్టుబడడంతో కేసు నమోదైంది. దీనికి తన స్నేహితుడు అఖిలే కారణమని అతడే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. పలుమార్లు ఒకరికొకరు పరస్పరం దూషించుకోవడమే కాకుండా ఎవరికి వారు గంజాయి ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. తరచూ గంజాయి సేవిస్తూ సెల్ఫోన్లో తిట్టుకునేవారు. దీంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది.
తనను పోలీసులకు పట్టించిన అఖిల్‌ను ఎలాగైన అంతం చేయాలని కక్ష పెట్టుకున్న చక్రి ఈ నెల 9న తన బ్యాచ్‌తో కలిసి అఖిల్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డాడు. దీనికి ప్రతికారంగా అఖిల్ కూడా తన బ్యాచ్‌తో కలిసి చక్రి ఇంటిపైకి వెళ్లి గొడవపడ్డాడు. గంజాయి మత్తులో ఇరువర్గాలు కత్తులతో దాడు చేసుకోగా దోటి ఉపేందర్‌తోపాటు సురారపు రాజుకు, చక్రికి గాయాలు అయ్యాయి. 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అఖిల్, షోయబ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.