నీలగిరి, జూలై 23: చోరీలకులకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 20 తులాల బం గారు ఆభరణాలు, కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, వెండి చెంబు, పల్లెం (మొత్తం 2.5కేజీలు), ఒక మోటార్ సైకిల్, రెండు ల్యాప్‌టాప్‌లు, మౌస్, స్పీకర్లు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిగా రాచకొండ, వరంగల్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి పూట తాళం వేసిన ఇం డ్లను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. మంగళవారం పట్టణంలోని సవేరా లాడ్జీలో గది అద్దెకు తీసుకొని అనుమానాస్పదంగా ఉండడంతో నమ్మదగ్గ సమాచారం మేరకు ఎస్ఐ సైదులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు.
బాలెం రాజేశ్, దస్తర్బండి షఫీ గతంలో ఎల్బీనగర్, సరూర్‌నగర్, కూకట్పల్లి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేసి చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. కాగా కట్టంగూర్ మండలంలోని యర్రసానిగూడానికి చెందిన ఉబ్బని యోగేశ్వర్ హైదరాబాద్‌లోని తుర్కయంజాల్‌లో ఉంటూ కారు డ్రైవింగ్ చేసుకుని జీవనం సాగిస్తున్నాడని, ఈ క్రమంలో రాజేశ్, ఫషీ మరో స్నేహితుడు తలారి మనోజ్ ద్వారా యోగేశ్వర్‌కు పరిచయమైందని తెలిపారు.
వీరంతా తాగుడుకు, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలని రాత్రి సమయంలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. యోగేశ్వర్ తన స్నేహితులైన వల్లూరి యువరాజ్ చంద్ర, సాయికుమార్, శ్రీకాంత్‌లకు చెప్పగా వీరందరూ ఒక టీమ్ గా ఏర్పడ్డారని తెలిపారు.
వీరు బైక్ చోరీ చేసి అకడి నుంచి కొంతదూరంలో రాత్రి సమయంలో తాళం వేసిన ఇండ్లలో దొంగతనం చేసి అనంతరం బైక్‌ను దగ్గరలోనే విడిచిపెట్టి దొంగసొమ్ముతో హైదరాబాద్‌కు వెళ్త పోలీసులను తప్పుదారి పట్టేంచేవారని తెలిపారు. హయాత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, మోతూరు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్, వరంగల్ కమిషనరేట్ పరిధిలో ధర్మసాగర్, ఖాజీపేట, మహబూబ్‌నగర్ జిల్లా, నల్లగొండ జిల్లాలో 23 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.