రామగిరి, సెప్టెంబర్ 16: తొమ్మిది రాత్రులు పూజలందుకున్న గణనాథుడికి జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వినాయక విగ్రహాన్ని ఉంచి బ్యాండ్ బాజాలతో పాటు, యువతీ యువకుల నృత్యాలు, కోలాటాలు, భజనల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
నల్లగొండలోని పాతబస్తి హనుమాన్‌నగర్‌లో ఏర్పాటు చేసిన 1వ నంబర్ వినాయక విగ్రహం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ రాములునాయక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఆర్డీఓ రవి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్నాటి విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, తాసీల్దార్ శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు, పీస్ కమిటీ సభ్యులు, ఉత్సవకమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలో 750కి పైగా విగ్రహాలు, 350కిపైగా చిన్న విగ్రహాలు నిమర్జనానికి తరలించారు.
మిర్యాలగూడ : పట్టణంలోని రెడ్డికాలనీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జనాన్ని భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేశిడి శేఖర్‌రెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, పైడిమర్రి నరసింహారావు, మందడి రవీందర్‌రెడ్డి, తాళ్ల వెంకట్‌రెడ్డి, రంగా శ్రీధర్, పైడిమర్రి సురేశ్, గార్లపాటి పండిత్రెడ్డి, పాదూరు ఇంద్రసేనారెడ్డి, పుట్టా దయాకర్‌రెడ్డి, బొజ్జ మోహన్‌రెడ్డి, మోహన్రాంరెడ్డి, బండారు నరసింహ పాల్గొన్నారు.
చందంపేట/కొండమల్లేపల్లి : దేవరకొండ, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల వద్ద ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణూధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ , నాయకులు నాయిని మాధవరెడ్డి, ఎంఏ సిరాజ్‌ఖాన్, ఊట్కూరి వేమన్‌రెడ్డి, పస్నూరి యుగేంధర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హాలియా : హాలియాతో పాటు మండలంలోని పులిమామిడి, కేకే కాల్వ, మర్లగడ్డగూడెం గ్రామాల్లో వినాయక విగ్రహాల వద్ద మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మాలే వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ నల్లగొండ సుధాకర్, యూత్ అధ్యక్షుడు కొల్లు కృపాకర్‌రెడ్డి, కోటిరెడ్డి, శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, శివ, లింగమ్య, మహేశ్, హరీశ్, రాంబాబు పాల్గొన్నారు.
హాలియా : హాలియాలోని అనన్య గ్రేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. మండలంలోని మదారిగూడెం గ్రామానికి చెందిన రిక్కల జానరెడ్డి, పద్మ దంపతులు రూ. 2,01,116కు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు.
నల్లగొండ సిటీ : కనగల్ మండలం కురంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాగిబావిగూడెంలో గణేశ్ లడ్డూ వేలం పాటలో గ్రామానికి చెందిన శీలం నర్సిరెడ్డి రూ.60.116కు పాడి దక్కించుకున్నారు.
నందికొండ : నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని సమ్మక్కసారక్క సమీపంలోని పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గతంలో పైలాన్‌కాలనీ కొత్త వంతెన వద్ద నిమజ్జనాలు చేసే వారు, అయితే ఆ ప్రాంతంలో అధికారులు నిమజ్జనానికి అనుమతించక పోవడంతో చుట్టు పక్కల గ్రామాల వారు కూడ హిల్‌కాలనీలోని పుష్కరఘాట్ వద్దనే నిమజ్జనం చేపడుతున్నారు. కృష్ణానదిలోకి వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేయడం బాగుందని భక్తులు చెబుతున్నారు. నిమజ్జనానికి ఆటకం కలుగకుండా అధికారులు క్రేన్ ఏర్పాటు చేశారు.
నిడమనూరు : మండలంలోని పార్వతీపురం గ్రామంలో సోమవారం గణేశ్ మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కులమతాలకు అతీతంగా షేక్ శంషుద్దీన్, చాందిని దంపతులు పాల్గొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను పరస్పరం గౌరవించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పేందుకే తాము పూజల్లో పాల్గొన్నట్లు దంపతులు తెలిపారు.