అర్వపల్లి, జూలై 22 : అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధుల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధు నాయుడు మాట్లాడుతూ.. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ఫ్యాషన్ కోసం కాదు, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా వాహనదారులకు హెల్మెట్లు అందించేందుకు ముందుకు వచ్చిన టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధులను ఎస్ఐ అభినందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధులు, వాహనదారులు పాల్గొన్నారు.