దేవరకొండ రూరల్, జూన్ 03 : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఎం.వి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నారై మునుకుంట్ల తిరుమల్ రెడ్డి, కొండ భీమనపల్లి మాజీ సర్పంచ్ విద్యావతి వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండభీమనపల్లిలోని సరస్వతమ్మ ఫంక్షన్ హాల్ లో ఎం.వి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ వారి సహకారంతో పది రోజులపాటు నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో మొబైల్ సర్జికల్ వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా కంటి అద్దాలు అందజేయడం, కంటి పరీక్షల కోసం వచ్చిన వారికి పది రోజుల పాటు భోజన వసతి కూడా కల్పించడం అభినందనీయమన్నారు. ఎన్నారైలు తమ స్వగ్రామాలలో ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇంత పెద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సేవ చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. అనంతరం కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే బాలునాయక్ చేతుల మీదుగా అందజేశారు. వైద్య శిబిరాన్ని డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించారు.