నల్లగొండ, జూలై 30 : వానకాలం సీజన్లో గోజాతి, గేదె జాతి పశువులకు గాలి కుంటు వ్యాధి సోకే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నటి. మూగ జీవాల్లో వ్యాధుల నివారణకు ప్రభుత్వం వ్యాధి నిరోధక టీకాల పంపిణీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమం ఆగస్టులో నెల మొత్తం కొనసాగేలా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అయితే టీకాలు వేసిన ప్రతి పశువుకు చెవుకు పోగులు వేసి ట్యాగ్ రూపంలో ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయనున్నారు.
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 52 బృందాలను ఏర్పాటు చేసి 2.18లక్షల పశువులకు ఈ టీకాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న 5 పశు వైద్యశాలలు, 41 ప్రాథమిక చికిత్స కేంద్రాలు, 42 గ్రామీణ పశు వైద్యశాలలతో పాటు అన్ని గ్రామాల్లో టీకాలు వేయనున్నారు. పశువుల్లో వచ్చే వ్యాధుల శాశ్వత నివారణకు టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నారు.
జిల్లాలో 5.25 లక్షల పశువులు ఉండగా జిల్లాలో మొత్తం 72 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో వైద్యుడితో పాటు ఇద్దరు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి మండలంలో రెండు పశు వైద్య శాలల చొప్పును మొత్తం 68 ఉండగా గ్రామీణ స్థాయిలో 74 వైద్య శాలలు ఉన్నాయి. ఆయా వైద్య శాలల పరిధిలో పని చేస్తున్న పశు వైద్యులు, సిబ్బంది సమన్వయంతో ఈడ్రైవ్ నిర్వహించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1.86 లక్షల పశువులు ఉండగా వైద్య సిబ్బంది శాఖ ఆధ్వర్యంలో 52 బృందాలు ఏర్పాటు చేసింది. రైతుల వద్దకు వెళ్లి టీకాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో తీవ్ర జ్వరం, కాలిగిట్టల మధ్య పగుళ్లు, నోటిలో పుండ్లు పడడం, బాగా నీరసించిపోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం, పని సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది. వ్యాధి సోకిన పశువుల్లో 5శాతం చనిపోతుండడంతో ఆర్థికంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2సార్లు ఉచితంగా టీకాలు అందిస్తున్నది. టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందిండడంపై పశువుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పశువుల్లో వస్తున్న వ్యాధుల నివారణకు ఏర్పాటు చేస్తున్న గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని పశువుల యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ఆగస్టు చివరి వరకు కొనుసాగుతున్నది. మండలంలోని అన్ని పశు వైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాము. టీకాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. పశు వైద్య సిబ్బంది స్వయంగా ప్రతి గ్రామానికి వచ్చి అందించే విధంగా ఏర్పాట్లు చేశాం.
– యాదగిరి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి, నల్లగొండ జిల్లా