– నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్లగొండ సిటీ, మార్చి 31 : ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బలమైన అడుగు అని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సులో రూ.10 వేల కోట్ల ఆదా చేసిన సందర్భంగా ప్రయాణించిన మహిళలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక ఆదా జరిగిందని తెలిపారు. 2023 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, మహిళలు, విద్యార్థులు కలిసి సుమారు రూ.10 వేల కోట్ల మేర ఆదా చేసుకున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలోనే సుమారు రూ.340 కోట్ల వరకు ఆదా జరగడం విశేషమన్నారు. ఈ పథకం వల్ల మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుని ఆ డబ్బును కుటుంబ అవసరాలు, విద్య, ఆరోగ్యంపై వినియోగిస్తున్నారని కలెక్టర్ వివరించారు. ఉచిత బస్సు సదుపాయం మహిళల ఆర్థిక భద్రతకు పునాది వేస్తోందని చెప్పారు. అలాగే త్వరలో అమలు కానున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు నెలకు సగటున రూ.5 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీ సదుపాయాల మెరుగుదల కోసం అవసరమైన ప్లాట్‌ఫామ్‌లు మంత్రి సహకారంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహాలక్ష్మి ఉచిత బస్సులో ప్రతిరోజు ప్రయాణించే నలుగురు మహిళలను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడిపిఓ హరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, డిపో మేనేజర్ రమణ హుస్సేన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు.