సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 21 : సూర్యాపేట జిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. మత్స్య సహకార సంఘ సభ్యత్వం అర్హతను బట్టి ప్రతి సభ్యుడికి ఉచితంగా ఇవ్వాలి. అయితే అధికారుల ధన దాహంతో సభ్యత్వాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. వీరి అవినీతికి పరాకాష్ట ఏమిటంటే సభ్యత్వం కోసం నిర్వహించే నైపుణ్య పరీక్షకు పక్షవాతం వచ్చిన వ్యక్తులు, వికలాంగులు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తదితరులు హాజరుకాకున్నా పరీక్షలో అర్హత సాధించినట్లు నిర్ధారించారు. తన భర్తకు సభ్యత్వం నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ పెట్టిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం ఆ మహిళ జిల్లా మత్స్య శాఖ అధికారికి వినతి పత్రం అందించేందుకు సోమవారం సుమారు ఐదు నుంచి ఆరు గంటల పాటు కలెక్టరేట్లో నిరీక్షించిందంటే అర్థం చేసుకోవచ్చు.
మత్స్య సహకార సంఘం అధికారులు, సిబ్బంది, సభ్యులు జిల్లాలోని అమాయకులు, అవగాహనలేని మత్స్యకారుల నుంచి ఇప్పటికే రూ.లక్షలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చెల్లింపులు సైతం నగదు, ఫోన్‌పే రూపంలో వసూలు చేస్తున్నారు. సభ్యత్వాలపై మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో వారిని లక్ష్యంగా చేసుకున్న దళారులు, అధికారుల అండతో దోచుకుంటున్నారు. జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు, మత్స్యకారుల నిరసనలు, ధర్నాలు జరుగుతున్నా జిల్లా పాలనాధికారులు దృష్టి పెట్టకపోవడంతో మరింత తెగించిన అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలోని మత్స్య సహకార సంఘ సభ్యత్వాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు.
అనర్హులు సైతం ఉత్తీర్ణత సాధించినట్లుగా మత్స్య సహకార సంఘ సభ్యత్వం కోసం నిర్వహించిన పరీక్షలో అధికారులు లీలలు వింతగా ఉన్నాయి. నైపుణ్య పరీక్ష నిర్వహించిన అధికారులు అర్హులకు కాకుండా అనర్హులు, పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లో ఉన్న వ్యక్తులు, వికలాంగులు సైతం నైపుణ్య పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించినట్లు సంతకాలు చేయడం విడ్డూరం. అంతేకాకుండా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్షకు హాజరైనట్లు నిర్ధారించి, కొన్ని సహకార సంఘాల్లో సభ్యత్వం కూడా కల్పించారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
గ్రూపులుగా వసూళ్లు..
జిల్లా కేంద్రంలోని మత్స్య సహకార సంఘంలో సభ్యత్వాల కోసం అమాయక మత్స్య కారులు బలవుతున్నారు. సభ్యత్వం ఇప్పిస్తామని రెండు గ్రూపులుగా ఏర్పడిన సభ్యులు.. ఎవరికి తోచిన విధంగా వారు అందినకాడికి అధికారుల సహకారంతో వసూ లు చేస్తున్నారు.అన్నీ తెలిసినా జిల్లా మత్స్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటే అర్థం చేసుకోవచ్చు.
ఆరు గంటలు నిరీక్షించిన మహిళ..
తన భర్తకు సభ్యత్వం ఇవ్వకపోవడంతో ఓ మహిళ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు సుమారు 6 గంటల పాటు నిరీక్షించింది. ఆ మహిళ తన భర్తకు భాగం ఇవ్వడం లేదని ఓ పెద్ద మనిషితో మాట్లాడిన వాయిస్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
నా దగ్గర ఫోన్‌పే ఆధారం ఉంది ..
నా భర్తకు ఎందుకు భాగం ఇవ్వడం లేదు.. కోర్టు నుంచి నా భర్తకు భాగం కల్పించాలని తీర్పు వచ్చినప్పుడు ఎందుకు లిస్టులో పేరు లేదు. పక్షవాతం వచ్చిన వ్యక్తి నైపుణ్య పరీక్షలో ఒకే అవుతాడు..నా భర్త ఈత కొట్టి వల వేస్తేనే నన్ను రూ.5 వేలు అడిగారు..నా దగ్గర ఫోన్‌పే ఆధారం కూడా ఉంది. సార్ల కు చూపిస్తా ..పక్షవాతం వచ్చిన వ్యక్తికి భాగం వస్తుం ది..అన్ని అర్హతలున్న నా భర్త పేరు ఎందుకు తొలగించారు. నా భర్త పేరు లిస్టులో 105 లేదా 108 వ పేరు ఉంది చూసుకోండి. రూ.5 వేలు ఒకసారి ఇచ్చిన.. మరోసారి రూ.15 వేల ఇచ్చిన. అధికారులకు ఇవ్వాలని అడగ్గానే ఇచ్చిన వ్యక్తి పేరు ఎలా తొలగిస్తారు.
నా భర్త పేరు తీసేసింది మీరేనంట..
పక్షవాతం ఉన్న వాళ్లకు భాగం ఉంటుంది. నా భర్త పేరు ఎందుకు లేదు.. నేను మొదట 5 వేలు కట్టిన.. మా ఆయన పేరు తీసేసింది మీరే నంట.. అందుకే నిన్ను అడుగుతున్నా.. ఆఫీసుకు వస్తా ..ఆఫీసు కాడ మాట్లాడతా అప్పుడు రూ5 వేలు. ఆ తర్వాత రూ. 15 వేలు కట్టిన. కానీ పేరు తొలగించి మా ఆయన భాగం 30 వేలకు అమ్ముకున్నవా.. అని సార్నే అడుగుతా.. నేను మహిళా మండలి సభ్యులందరినీ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకు వస్తా..అందరూ రావాలి..పేరు ఎవరు తీసేశారని చాలా మందికి ఫోన్ చేసిన. అం దరూ వస్తారు..మహిళా మండలి అధ్యక్షురాలిని. అన్నీ అర్హతలున్న నా భర్తకు సభ్యత్వం ఎందుకు ఇవ్వరు..ఈత కొట్టనిదే మేడం ఒకే ఎలా అన్నది. రూ.5 వేలు ఎందుకు తీసుకున్నరు. ఇష్టం వచ్చిన వారికి సభ్యత్వాలు అమ్ముకోవడానికి మీరెవరు.. డబ్బులు ఇచ్చినం..ఎందుకు భాగం ఇవ్వరు.. పక్షవాతంతో ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తారు..అంటూ ప్రశ్నించిన ఓ మహిళ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.