నందికొండ, జులై 30: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గకపోవడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దీంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,04,048 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగించారు. రెండో రోజూ వరద పోటెత్తడంతో 10 గేట్లను 10 అడుగులు, 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,65,816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు బుధవారం నాటికి 587.60 (305.8626 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంచి పైనుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన గల కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి కృష్ణమ్మ పరవళ్లతో వరద జోరు కొ నసాగుతోంది. కృష్ణా బేసన్లోని ప్రాజెక్ట్‌ల్లో భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకుంటున్నాయి.
వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,55,811 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా 3,12,158 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ఎడమ కాల్వ ద్వారా 7,272 క్యూసెక్కలు, కుడి కాల్వ ద్వారా 8,144 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,65,816 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,826 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 885 ( 215.81 టీఎంసీలు) అడుగులకుగాను 882.80 ( 203.4290 టీఎంసీల) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 3,10,398 క్యూసెక్కల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో శ్రీశైలం డ్యాం 8 క్రస్ట్ గేట్లను 10 అడుగులు ఎత్తి 2,16,520 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్‌కు వదిలారు.
నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలతో కృష్ణమ్మ అందాలను తిలకించడానికి పర్యాటకులు ఉదయం నుంచి డ్యాం పరిసరాల్లోకి చేరుకున్నారు. డ్యాం కొత్త బ్రిడ్జి, శివాలయం పుష్కరఘాట్, జలవిద్యుత్ కేంద్రం, డ్యాం పిల్లర్, లాంచీస్టేషన్, దయ్యాల గండి పరిసరాల్లో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ జల సవ్వడులను వీక్షిస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. డ్యాం పరిసరాల్లో తినుబండారులు, చేపల ఫ్రై, ఐస్‌క్రీమ్‌లు, మసాల చాట్లను ఆస్వాదిస్తూ పర్యాటకులు సరదాగా గడిపారు.