నీలగిరి, జూన్ 22: నల్లగొండ పట్టణ శివారులోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కలకలం రేగింది. కుటుంబ సభ్యులంతా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు రక్తపు మరకలు ఉండటం, గేటుకు బయటి నుంచే తాళం వేసి ఉండటంతో వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలనీ వాసులు, స్థానిక కార్పొరేటర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి ఇంటి బయట గేటు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు.
మృత దేహాలు నాలుగూ కుళ్లిపోయి ఉండటాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ ప్రకాశం బజార్‌లోని ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తున్న మహ్మద్ సుల్తాన్ (45) భార్య గతంలో చనిపోయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ముజామ్మిల్ (20), కూతురు అప్సర్(14) ఉన్నా రు. సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో విడాకులు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న హసీనాను (41) రెండో వివాహం చేసుకున్నాడు. కాగా వీరు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చా రు.
ఇది హత్యా..? ఆత్మహత్యా..? అన్న కోణంలో వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు ఇంట్లో ఘర్షణ జరిగినట్లు స్థానికుల చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం, క్లూస్ టీమ్, ఆధారాల సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా విషయం తెలియడంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ రమేష్ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితమే వీరు మరణించడంతో శవాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని, దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు..
ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ నలుగురి మృతికి కారణాలు తెలియకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఏసీ మెకానిక్‌గా పనిచేసే ముజమ్మిల్ ఎప్పుడూ కుటుంబ గొడవలు ఉన్నాయని, వాటితో సతమతమవుతున్నానం టూ స్నేహితులతో అనేవాడని తెలిసింది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం, దొంగతనం చేసినట్లుగా వస్తువులు కింద పడేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.