నల్లగొండ ప్రతినిధి, జూలై5(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి లక్ష్యంగా గత రెండు నెలలుగా దోపీడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ సభ్యులను ఎట్టకేలకు నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం, దేవలమ్మనాగారంలో దొంగతనాలకు పాల్పడి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న పార్థీ గ్యాంగ్‌ను శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ పోలీసులు వెంబడించారు.
హైవేపై కొత్తగూడెం వద్ద ఆటో ఎక్కిన ఇద్దరు దొంగలను పోలీసులు ఆ వెనకాలే వెంబడిస్తూ అదునుకోసం వేచి చూశారు. ఇంతలోనే పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు దాటగానే ఓ మహిళ ఆటో ఆగింది. వెంటనే పోలీసులు ఆటోను చుట్టుముట్టారు. వెంటనే అప్రమత్తమైన దొంగలు కత్తులతో దాడికి యత్నించగా పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరుపుతూ దొంగలను ఆటోలోనే బంధించారు. చేతులను తాళ్లతో కట్టివేసి అదే ఆటోలో విచారణ కోసం నల్లగొండకు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ సభ్యులు పార్థీ గ్యాంగ్‌లోని షిండే ముఠాకు చెందిన వారీగా పోలీసులు చెబుతున్నారు.
వీరితోపాటు మరో నలుగురు దొంగలు కూడా ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగలను విచారించి మిగతా గ్యాంగ్ సభ్యులను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్థీ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలు వారం రోజులుగా ఇదే పనిలో నిమగ్నం కాగా శుక్రవారం గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యుల ఆటకట్టించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.
ప్రత్యేక బృందాలతో నిఘా.
పెద్దకాపర్తి వద్ద నిద్రిస్తున్న కారులో దొంగతానికి పాల్పడిన సమయంలోనే అప్పటి ఎస్పీ చందనాదీప్తి దీన్ని సీరియస్‌గా తీసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైవే వెంట ఉన్న సీసీ టీవీ రికార్డింగ్‌లను జల్లెడ పట్టారు. పలు హోటళ్ల వద్ద పార్థీ గ్యాంగ్ సభ్యులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. సీసీ టీవీ రికార్డింగ్‌ల ప్రకారం మరింత నిఘా పెట్టారు. ఎస్పీ మారి కొత్త ఎస్పీగా శరత్ చంద్ర పవార్ బాధ్యతలు చేపట్టాక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సీసీఎస్ పోలీసులతోపాటు సివిల్ పోలీసులతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిత్యం హైవేపై అనుమానిత వ్యక్తుల సంచారంపై నిఘా పెట్టడంతో పాటు జరుగుతున్న దొంగతనాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఘటనలు జరిగిన అన్ని చోట్లా సీసీ టీవీ రికార్డులను పరిశీలిస్తూ ఓ అంచనాకు వచ్చారు. గ్యాంగ్‌లో ఇద్దరి సభ్యుల సీసీ టీవీల ఫొటోలను సేకరించి వాటి ఆధారంగా వారి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అదును కోసం వేచిచూశారు.
చౌటుప్పల్ పరిధిలో దొంగతనంతో…
చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం, కొయ్యలగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున పార్థీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడింది. దేవలమ్మనాగారంలో సందీప్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో బంగారం, 20వేల రూపాయలను దొంగతనం చేశారు. అక్కడి నుంచి కొయ్యలగూడెం వచ్చి ఒక ఇంట్లోకి చొరబడగా ఇంట్లో వారు మేలొనడంతో పారిపోయారు. పారిపోతూ అక్కడే కొన్ని మారణాయుధాలు వదిలివెళ్లారు. తెల్లవారుజామున జరిగిన దొంగతనాల విషయం తెలిసి నల్లగొండ పోలీసులు అలర్ట్ అయి హైవేపై మాటు వేశారు.
ఈ క్రమంలో కొత్తగూడెం ఆటో ఎక్కిన ఇద్దరు దొంగలను అనుసరిస్తూ వెళ్లిన పోలీసు బృందం ఔటర్ రింగ్ రోడ్డు దాటగానే సంపూర్ణ హోటల్ ముందు ఆటో ఆగడంతో పోలీసులు చుట్టుముట్టి దొంగలను బంధించారు. వీరిని ఆ ఆటోలోనే నల్లగొండకు తీసుకువస్తున్న క్రమంలో పోలీసుల విచారణలో ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యతో పాటు పెద్దకాపర్తి వద్ద కారులో నిద్రిస్తున్న వారి వద్ద దొంగతనం కూడా తామే చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దాంతో ఇటీవల జరిగిన దొంగతనాలతోపాటు మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు విచారిస్తున్నారు. ట్టుబడిన దొంగలు పార్థీ గ్యాంగ్‌లోని షిండే వర్గానికి చెందిన వారుగా సమాచారం.
హైవేల వెంట పార్ధీ గ్యాంగ్ హల్చల్
మే నెల ఆరంభం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్థీ గ్యాంగ్ అలజడులు మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా హైవేలపై ఆగి ఉన్న వాహనాల్లో లేదంటే హైవే వెంట ఉన్న గ్రామాల్లోని ఇండ్లల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణంలో అలిసిపోయి రహదారి పక్కన వాహనాలు ఆపుకుని నిద్రపోయేవారిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. నిద్రపోయేవారిని లేపి కత్తులు చూపి బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా వాహనాల్లో నిద్రిస్తున్న వారి వద్ద నుంచి నగలు, నగదు దోచుకుంటూ హల్చల్ చేస్తుండడం వాహనదారులు, నల్లగొండ పోలీసులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నది.
మే 18న ఏపీ నుంచి సరకును హైదరాబాద్‌లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలసిపోయి కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం వద్ద పారింగ్ స్థలంలో ఆపిన మినీ డీసీఎం డ్రైవర్ హత్యకు గురయ్యాడు. దుండగులు అతని కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అవతలి వైపు రహదారి పకన పడేశారు. మే 19న అదే ప్రాంతం లో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్‌ను దొంగతనం చేశారు. గత నెల 23న కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద మరో దొంగతనం చేశారు. 28న నకిరేకల్ పటేల్‌నగర్‌లో ఓ ఇంట్లో 8 తులాల బంగారం ఎత్తుకు పోయారు.
గత నెల 9న తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా వాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యా ల మండలం పెద్దకాపర్తి వద్ద సర్వీసు రోడ్డు లో కారు ఆపారు. అందులో నిద్రిస్తున్న వారిపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి దాడి చేశారు. ప్రయాణికుల దగ్గర ఉన్న సుమారు 10 తులాల బంగారాన్ని అపహరించారు. తాజాగా చౌటుప్పల్ మండలం దండు మ లాపురం వద్ద హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనదారులు అలసిపోయి స్వాతి హోటల్ వద్ద పకకు పారు చేసి నిద్రపోయారు. ఇదే అదునుగా దోపిడీ దొంగలు కారులో రెండు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో ఒకసారిగా హైవేపై దోపిడీ దొంగల కలకలం రేపింది.
నేడు ఎస్పీ ప్రెస్‌మీట్?
పోలీసులు అదుపులో ఉన్న దొంగల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఎస్పీ డైరెక్షన్లో ప్రత్యేక బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరు చెప్తున్న వివరాల ఆధారంగా మిగతా సభ్యుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపినట్లు తెలిసింది. శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఇద్దరు పార్థీ గ్యాంగ్ దొంగల అరెస్టుకు సంబంధించి శనివారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు తెలిసింది. గ్యాంగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దొంగతనాలు, ఇతర అంశాలను ఎస్పీ వెల్లడించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.