నీలగిరి, ఆగస్టు 26: ఖరీదైన కార్లలో తిరుగుతూ రాత్రి వేళల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న పదహారు మందితో కూడిన నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వారి నుంచి రూ. రెండు లక్షల 46వేల నగదు, రూ.2 లక్షల 75వేల విలువైన 22 గొర్రెలు, రూ.47 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెలడించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా జిల్లాలో మేకలు, గొర్రెలు చోరీ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం శాలిగౌరారం మండలంలోని బైరవోనిబండ క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేపడుతున్న సమయంలో ఒక స్విఫ్ట్ డిజైర్ కారు అనుమానాస్పదంగా కనిపించిందన్నారు.
కారు వద్దకు వెళుతుండగా అందులోని వ్యక్తుల తప్పించుకొని పారిపోయేందుకు యత్నించినట్లు తెలిపారు. వెంటనే వాహనాన్ని వెంబడించి పట్టుకోగా అందులో ముగ్గరు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు తెలిపారు. వారి వేలిముద్రలను సానర్తో చెక్ చేయగా సంపంగి వెంకటేష్, వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్ కుమార్ అలియాస్ కోటిగా గుర్తించామన్నారు. వీరిపై గతంలో నల్గొండ రూరల్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్‌పల్లి, నల్గొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మేకల చోరీ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినట్ల తేలిందన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు ప్రాంతాల్లో మేకలు, గొర్రెలు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వీరితో పరిచయం ఉన్న మరో 12 మంది నాలుగు ముఠాలుగా ఏర్పడినట్లు తెలిపారు.
పట్టుబడిన వారిలో వరికుప్పల రవి, చింటూ, గండికోట శివ కుమా ర్, అమ్ములూరి విజయ్, వరికుప్పల రాజు, లింగాల అ శోక్, ఉండం కళ్యాణి, కోటేశ్,లడ్డూ,కనుకుల బేబీ ఉం డగా, వల్లెపు ప్రసాద్, మద్యాల సహదేవ్, కొడిసె వంశీ కృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్ కుమార్, మట్టి సురేష్ ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఎవరికీ అనుమానం రాకుండా వేర్వేరుగా ఖరీదైన కార్లలో వచ్చి పగ టి పూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో మేకలను కార్లలో వేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. విచారణలో వీరు జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకల దొంగతనాలకు పాల్పడినట్టు తే లిందన్నారు.
వీరు దొంగలించిన మేకలను సంతలో గు ర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారని, మొత్తం 26 చోరీలకు పాల్పడి 200లకు పైగా మేకలను విక్రయించినట్లు తెలిపారు. ఈకేసును నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి , నల్గొండ సీసీఎస్ సీఐలు జితేందర్ రెడ్డి, నాగభూషణ్, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, నారట్ పల్లి సీఐ నాగరాజు, ఎస్సైలు శివ కుమార్, విజయ్ కుమార్, రవి, రవి కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన గిరి, వహీద్ పాషా, సూఫయాన్ అలీ, రామ్ ప్రసాద్, నాగరాజు, సీసీఎస్ కానిస్టేబుల్ అష్రార్, మహేశ్, వెంకట్ రామ్, సాయిలను ఎస్పీ అభినందిస్తూ వారికి ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు.