నల్లగొండ రూరల్, ఆగస్టు 22 : నల్లగొండ మండలంలోని అన్నెపర్తి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం నిర్మాణ పనులకు నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూఫ్ వాటర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఏఈ రమేశ్, పంచాయతీ కార్యదర్శి మందడి విజయ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీ సైదులు గౌడ్ ఉన్నారు.