అనంతగిరి, మే 31 : గతంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాజా మాజీ సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీఓ రామచంద్రరావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు మండల వ్యాప్తంగా సుమారు రూ.3 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.
చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. పదవీ కాలం ముగిసి ఏడాదిన్నరైనా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దారుణమని విచారణ వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు.