నీలగిరి, ఫిబ్రవరి 8 : ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసగించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ఓటుతో కొట్టే దెబ్బకు దిమ్మ తిరగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నదని, ఇప్పటికే తిరుగుబాటు మొదలైందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అదివారం నల్లగొండలోని 4,36,38,39,40,18,19,20,42,22,23,24,44డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఒక పని కూడా కావడం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో ఒకటీ అమలు చేయలేదని విమర్శించారు. రైతులు యూ రియా కోసం చెప్పులు క్యూలో పెట్టి నిలబడే దుస్థితి వచ్చిందని, కాంగ్రెస్ పాలన ఇంత దరిద్రంగా ఉంటుందనుకోలేదని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. నాడు కేసీఆర్ నల్లగొండపై ప్రత్యేక దృష్టి సారించి రూ.1300 కోట్లు విడుదల చేయడం, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయడం వల్లే నల్గొండకు కార్పొరేషన్ అర్హత వచ్చిందన్నారు. 20 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ మున్సిపాలిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామన్నారు. కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని పేరొన్నారు. దాదాపు రూ.1300 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జ్ కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లోడంగి గోవర్ధన్, అభ్యర్ధులు రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, అల్లిగౌతమీ శివశంకర్, అల్లి వేణు, గంగుల దీప్తి, కొండురు ఎల్లమ్మ సత్యనారాయణ, వింజమూరు లక్ష్మీనారాయణ, మహ్మద్ షంషోద్దీన్, మహ్మద్ ఫాజిల్ అహ్మద్, గోపగాని స్వాతీరాజశేఖర్, పొగాకు నాగరాజు, కాకా సైదోద్దీన్, సీపీఎం అభ్యర్ధి ఎండీ సలీం, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.