మోతె, మార్చి 12 : ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని, నీళ్లు లేక పంటలు ఎండుతున్నా కనీసం పట్టించుకోనే వారే లేరని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మోతె మండలం బీక్యాతండా గ్రామంలో బుధవారం ఎండిపోయిన వరి పొలాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని అన్నారు. మోతె మండలంలో పంటలు ఎండిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే పద్మావతి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతుంటే, పాలకులకు కండ్లు కనిపించడం లేదా అన్నారు. పంటలు ఎండిపోయి కొందరు రైతులు జీవాలకు మేతగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదని, గ్రామాల్లో రానురాను తాగు నీరు కూడా దొరికే పరిస్థితి ఉండదని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు పంపిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని, నీళ్లు ఉండి కూడా పంటలు ఎండబెట్టే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. కాళేశ్వరం పేరు కనపడకుండా, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ సర్కారు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో నీళ్లు ఇస్తే రైతులను ఆదుకోవచ్చని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30వేల పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వకపోతే రహదారులు దిగ్బంధిస్తామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని కాల్వలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, కార్యదర్శి మద్ది మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఏ లూరి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని సతీశ్, నూకల శ్రీనివాస్, నూకల యుగంధర్‌రెడ్డి, పల్స్ మల్సూ ర్, కారింగుల శ్రీనివాస్, గుండాల గంగు లు, భూ క్య గాంధీ, బాణోతు బాబునాయక్, ముత్త య్య, జానీపాష, పిట్టల నగేశ్, దేవులా పాల్గొన్నారు.
తొమ్మిది ఎకరాల వరి పొలం ఎండిపోయింది
నాకు తొమ్మిది ఎకరాల వరి పొలంతోపాటు ఐదెకరాల మామిడి తోట ఉంది. నీళ్లు లేక పూర్తిగా వరి పంట ఎండిపోయింది. బావులు, బోర్లలో కూడా నీళ్లు అడుగంటిపోయినయి. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు వస్తాయని అనుకొని వరి సాగు చేసిన. చేతికొచ్చిన మొత్తం వరి పొలం నీళ్లు లేక ఎండిపోయింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన. ఇప్పటికైనా ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తే కనీసం మామిడి తోటనైనా కాపాడుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు వచ్చాయి. పంటలు కూడా పుష్కలంగా పండించుకున్నాం.
-బాణోతు హరియా, రైతు బీక్యాతండా, మోతె మండలం