ఆలేరు టౌన్, డిసెంబర్ 20 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రేస్ ఫార్ములాను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి, ప్రతి ఏడాది రూ.700కోట్లు సమకూర్చే ఆదాయానికి గండికొట్టిన ఈ- రేస్ కేసులో రేవంత్‌రెడ్డిని ఏ1గా చేర్చాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రహదారి బంగ్లాలో ఆమె శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ-రేస్ ఫార్ములాలో కుంభకోణం జరిగిందని, అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1 గా, ఐఏఎస్ అధికారిని ఏ2గా, హెచ్ఎండీఎ చైర్మన్ బీఎన్‌రెడ్డిని ఏ3గా కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ -రేస్ కేసు ఏసీబీకి అప్పంగించి 6నెలలు అవుతున్నా కేసు దర్యాప్తు పూర్తి చేయలేదని తెలిపారు. గతంలో ఈ రేస్ ఫార్ములా కోసం వివిధ రాష్ర్టాలు గుజరాత్, తమిళనాడు పోటీ పడగా, భారతదేశంలోనే గ్రీన్ సిటీగా అవార్డు పొందిన హైదరాబాద్‌ను ఆ సంస్థవారు కేటీఆర్‌తో మాట్లాడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-రేసు ఏర్పాటు చేయడం వల్ల ఏటా 3వేల కోట్ల మంది పర్యాటకులు వచ్చేవారని చెప్పారు. తెలంగాణ రాఫ్ట్రాన్ని గొప్ప పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో స్కై, ైప్లెఓవర్లు, మెట్రో రైలును కేటీఆర్ అందుబాటులోకి, సరిగ్గా పరిపాలన చేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించేవారిపై ఎలా కేసులు పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాడని ఆరోపించారు.
వివిధ దేశాలు పర్యటించిన కేటీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆలోచిస్తే, చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ ఎలా కేసులు పెట్టాలి? ఎవరిని జైల్లో పెట్టాలని కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో రాష్ర్టాన్ని కాలుష్యరహితంగా మార్చాలనే సంకల్పంతో ఈ-రేసును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ రేసు సంస్థ 2024 డిసెంబర్ 21 నుంచి పోటీలు నిర్వహించాలని ఉత్తరం రాస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడంతో, సదరు సంస్థ వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పినట్లు ఆమె తెలిపారు. ఫార్ములా రేస్ కోసం అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన తెలుపుతుంటే షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ఎమ్మెల్యేలపైకి చెప్పులు విసరడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే శంకర్‌ను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పాలన చేతగాక రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించింది చాలక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద సీఎం, మంత్రులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని గతేడాది కాలంగా మూర్ఖంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంగా అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం గౌడ్, నాయకులు పత్తి వెంకటేశ్, పంతం కృష్ణ, జెల్లి నర్సింహులు, కర్రె అశోక్, దయ్యాల సంపత్, కుండె సంపత్, ఎండీ ఫయాజ్, ఎండీ గోరేమియా, కటకం బాలరాజు, ప్రశాంత్, ఆలేటి అజయ్ తదితరులు పాల్గొన్నారు.