చందంపేట (దేవరకొండ), ఆగస్టు 23 : సీపీఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. సురవరం సుధాకర్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు. 2004 నుండి 2009 వరకు తనతో కలిసి పని చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సురవరం తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దం అని కొనియాడారు. సురవరం పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.