హాలియా, డిశంబర్ 31 : ‘సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. ప్రస్తుత ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి మరింత అభివృద్ధి చేస్తే అన్ని రంగాల్లో సహకరిస్తాం.. కానీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడితే సహించం’ అని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. ఆదివారం హాలియాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులుతో కలిసి మాట్లాడారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. ఎమ్మెల్యే చిత్తశుద్ధితో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తే ఆయనకు సహకరిస్తామన్నారు. కానీ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి అభివృద్ధిపై దృష్టిసారించకుండా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నాడని, దీనిని సహించేది లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని.. దీనిని సరిదిదాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు.
గొర్రెల పంపిణీ యూనిట్ల కోసం యాదవులు డీడీలు కట్టారని, గత ప్రభుత్వం మొదటి విడుతగా యూనిట్టు అందించిందని, ఎన్నికల కారణంగా రెండో విడుత ఇవ్వలేక పోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీడీ కట్టిన వారికి గొర్రెలు అందించాలని, లేదా వాళ్లు కట్టిన డీడీలను తిరిగి ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. రాంచందర్‌నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నల్లగొండ సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, రవినాయక్, తాటి సత్యపాల్, పిడిగం నాగయ్య, పట్టణ అధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, పేరూరుదేవస్థ్ధాన కమిటీ మాజీ చైర్మన్ రాయనబోయిన రామలింగయ్య, రాంబాబు, కృష్ణ పాల్గొన్నారు.