త్రిపురారం, సెప్టెంబర్ 10 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆగస్టు 15లోపు చేస్తాన్న రుణమాఫీ విషయమై స్పష్టమైన సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మంగళవారం రైతులు పడుతున్న ఇబ్బందులు, రుణమాఫీ విషయమై అధికారులు, రైతులతో మాట్లాడారు.
ఆధార్, బ్యాంక్ అకౌంట్లో చిన్న తప్పులు ఉన్నా రుణమాఫీకి అర్హులు కారని ఒకవైపు వ్యవసాయాధికారులు, మరోవైపు బ్యాంక్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు పడుతున్న గోస సీఎంకు, మంత్రులకు పట్టడం లేదని తెలిపారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాహనంపై చేయి ఊపుకుంటూ తిరిగితే ప్రజాపాలన కాదని, సెక్యురిటీ లేకుండా సామాన్య నాయకుడిగా ఒక్క గ్రామంలో పర్యటించి రైతులు, ప్రజల కష్టాలను తెలుసుకోవాలని చెప్పారు.
ఏ మంత్రిని అడిగినా రుణమాఫీపై పొంతన లేకుండా సమాధానం చెబుతున్నారని, రూ.2లక్షలు దాటిన రుణం వారి బ్యాంకుల్లో వేలకు వేలు డబ్బులు కట్టినా ప్రతిఫలం లేకుండా పోతుందని తెలిపారు. రైతులను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, పంట కాల్వలో పూడిక తీసే పరిస్థితుల్లో యంత్రాంగం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చివరి భూములకు నీరు అందించామని, రైతుల కష్టాన్ని తమ కష్టంగా భావించిన కేసీఆర్‌నే అన్నదాతలు తలుచుకుంటున్నారని అన్నారు.
వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండడం లేదని, రైతుల పక్షాన అడగడానికి వస్తే ఐదు నిమిషాల ముందుగానే ఏఓ వెళ్లిపోయారని, ఏఈఓలు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా తెలియదంటున్నారని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెర్ల జానయ్య, నాయకులు బైరం కృష్ణ, రాయనబోయిన వెంకటేశ్వర్లు, వెంకటాచారి, సయ్యద్, గుండెబోయిన వెంకన్న, చిమట మట్టయ్య, దైద రవి, బిచ్చునాయక్ ఉన్నారు.